Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుకు కోడి పందేల పోటు

By:  Tupaki Desk   |   30 Dec 2015 5:07 AM GMT
ఏపీ సర్కారుకు కోడి పందేల పోటు
X
కొత్త సంవత్సరం వస్తుందంటే ఏపీ సర్కారుకు ఓ తలనొప్పి సిద్ధంగా ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు భారీగా సాగటం ఏపీలో ఒక అలవాటు. దీనికి అధికారిక అనుమతి ఉండదు. అదే సమయంలో ప్రజల్లో దీనిపై భారీ ఆసక్తి నెలకొనే పరిస్థితి. కోర్టులేమో వద్దంటాయి. చట్టం ఒప్పుకోదు. కానీ.. జనాలు మాత్రం కోడి పందాలు ఉండాల్సిందేనంటారు. కోర్టు మాట ఒకపక్క.. జనాభిప్రాయం మరోపక్క.. తేల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి.

ప్రభుత్వంలో ఎవరున్నా ఈ తిప్పలు తప్పవు. తాజాగా.. కోడి పందాల మీద హైకోర్టు స్పందించింది. పందాల నిర్వహణకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. కోడి పందాలపై కోర్టులు స్పందించి ఉత్తర్వులు ఇచ్చినా.. వాటిని ఆపటం లేదంటూ దాఖలైన పిటీషన్ మీద హైకోర్టు విచారించింది. కోడి పందాలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చింది. కోడి పందాలు నిర్వహించొద్దంటూ గతంలోనే ఆదేశాలు జారీ చేశామంటూ ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పటం.. ఆప్రతిని కోర్టుకు సమర్పించాలని కోర్టు కోరింది.

తాజా పరిస్థితుల్లో కోడి పందాలకు కోర్టు నుంచి సానుకూలత వచ్చే అవకాశం కనిపించని పరిస్థితి. ఓ పక్క కోర్టు మాట.. మరోపక్క ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఏపీ సర్కారుకు తలనొప్పి కావటం ఖాయమని చెప్పొచ్చు.