Begin typing your search above and press return to search.

ప్రపంచంలో ఇలాంటి దేశాధ్యక్షుడు ఉన్నాడంటే మీరు నమ్మరు!!

By:  Tupaki Desk   |   27 Nov 2020 4:30 PM GMT
ప్రపంచంలో ఇలాంటి దేశాధ్యక్షుడు ఉన్నాడంటే మీరు నమ్మరు!!
X
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పుణ్యమా అని లక్షలాది మంది మరణించారు. అగ్రరాజ్యమైన అమెరికాలో అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఏదైనా దేశంలో మరణాలు అయితే తీవ్రవాదులు.. ఉగ్రవాదుల కారణంగా.. లేదంటే యుద్ధాల కారణంగా. అందుకు భిన్నంగా కంటికి కనిపించని వైరస్ అమెరికాను దారుణంగా దెబ్బ తీసింది. ఈ పరిస్థితికి కారణం అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అని కూడా వ్యాఖ్యానిస్తుంటారు.

అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు చోటు చేసుకున్న దేశంగా బ్రెజిల్ ను చెప్పాలి. ఈ దేశంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటమే కాదు.. మరణాలు కూడా ఎక్కువ. అయినప్పటికీ.. ఈ దేశాధ్యక్షుడు జైర్ బొల్సానారో తీరు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే. మూర్ఖత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా అతడి తీరు ఉంటుందని చెప్పాలి. కోవిడ్ వ్యాక్సిన్ ను వేసుకోవటానికి ఆయన ససేమిరా అంటారు. అదేమంటే.. అది తన జన్మహక్కు అంటూ పెడసరంగా మాట్లాడతారు.

వ్యాక్సిన్ పై విముఖత ప్రదర్శించే ఆయన.. కోవిడ్ కు టీకా తీసుకోకపోవటం అది తన హక్కుగా ఆయన చెబుతారు. తాను చెడింది కాక.. తన దేశ ప్రజలు నష్టపోవటానికి సైతం వెనుకాడరు. తాను టీకా తీసుకోకుంటే తీసుకోపోనివ్వండి.. బ్రెజిల్ వాసులు సైతం టీకా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. కరోనా నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించటం ఒక అలవాటుగాచేసుకోవటం తెలిసిందే.

అయితే.. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో మాత్రం మాస్కుల విషయంలోనూ పలు సందేహాల్ని వ్యక్తం చేస్తారు. మాస్కు ధరిస్తే.. కరోనా వ్యాపించదన్న విషయం శాస్త్రీయంగా నిరూపితం కాలేదంటారు. అంతేకాదు.. వ్యాక్సిన్ బ్రెజిల్ వాసులకు అవసరం లేదని.. కుక్కలకు మాత్రమే అవసరమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే.. ఆయనకు మూర్ఖత్వం మరీ ఇంత ఎక్కువా? అన్న భావన కలుగక మానదు.

వాస్తవానికి మిగిలిన దేశాలతో పోలిస్తే.. బ్రెజిల్ లో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి. దేశాధ్యక్షుడి మొండితనం.. కరోనా విషయంలో ఆయన ప్రదర్శించే నిర్లక్ష్యం ఆ దేశాన్ని కరోనా బాధిత దేశంగా మార్చారు. ఆ దేశంలోని మారుమూల అటవీ ప్రాంతానికి కరోనా పాకిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన వరకు ఆయనే.. తనకు కరోనా సోకిన విషయాన్ని దాచి పెట్టి.. మీడియా ప్రతినిధుల్ని పిలిచి.. వారంతా వచ్చిన తర్వాత వారికి కాస్త దూరంగా జరిగి తన ముఖానికి పెట్టుకున్న ఫేస్ మాస్కు తీసి.. తాను కరోనా పాజిటివ్ అని చెప్పటంతో.. వారంతా భయంతో గజగజలాడిపోయిన పరిస్థితి. ఇలాంటివెన్నో బ్రెజిల్ దేశాధ్యక్షుడి సొంతం. ప్రపంచంలో ఈ తరహా దేశాధ్యక్షుడు మరొకరు ఉండరేమో?