Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు షాక్, వైసీపీలోకి కీలక నేత, ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   11 March 2020 3:54 PM GMT
చంద్రబాబుకు షాక్, వైసీపీలోకి కీలక నేత, ఎమ్మెల్యే
X
ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పలువురు నేతలు సైకిల్ దిగుతున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో కీలక నేత సతీష్ వైసీపీలో చేరారు. రామసుబ్బారెడ్డి కూడా అదే బాటలో ఉన్నారనే ప్రచారం సాగింది. ఇప్పుడు మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి కరణం బలరాం వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

గురువారం లేదా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిసే అవకాశాలు ఉన్నాయి. జగన్‌ను కలిసి అదే సమయంలో పార్టీలో చేరుతారా లేక ఆ తర్వాత పార్టీలో చేరుతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికురమార్ వర్గీయుల మధ్య పొసగదు. ఇప్పుడు గొట్టిపాటి టీడీపీలో ఉన్నారు. అద్దంకి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పైగా, టీడీపీ అధికారంలో లేదు. ఈ నేపథ్యంలో అన్ని విధాలుగా ఆలోచించి కరణం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

కరణం బలరాం చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 1978లో ఆయన కాంగ్రెస్(ఐ) తరఫున అద్దంకి నుండి పోటీ చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుత టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ కు పరిచయం చేసింది కరణం కావడం గమనార్హం. అంతేకాదు, నాడు చంద్రబాబు తరఫున పెళ్లి పెద్ద కూడా ఈయనే. ఇలాంటి నేత టీడీపీకి దూరం కానుండటం గమనార్హం.

కరణం బలరాం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల వ్యవహారంపై స్తబ్దుగా ఉన్నారు. గొట్టిపాటి పార్టీలోకి వచ్చినప్పటి నుండి కరణం అసంతృప్తి తో ఉన్నారు. ఇరువర్గాల మధ్య కొన్ని సందర్భాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో అద్దంకి నుండి గొట్టిపాటి గెలవగా, కరణం చీరాల నుండి విజయం సాధించారు.