Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి ఈ అడుగులు ఎక్కడి వరకు..? 1

By:  Tupaki Desk   |   21 Nov 2015 4:43 AM GMT
బ్రాహ్మణి ఈ అడుగులు ఎక్కడి వరకు..? 1
X
రాజకీయాల్ని సామాన్యుడికి సుపరిచితంగా మార్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఎన్టీవోడికి మాత్రమే దక్కుతుంది. ఎన్టీవోడు రాజకీయాల్లోకి వచ్చే వరకూ రాజకీయాలు అంటే చాలా కొద్ది మంది.. కొన్ని వర్గాలకు చెందిన వ్యవహారంగా భావించేవారు. కానీ.. ఎన్టీవోడు ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో.. రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. సామాన్యుడి సైతం రాజకీయాల మీద దృష్టి సారించటమే కాదు.. దాని గురించి అవగాహన విపరీతంగా పెంచుకున్నారు. ఇక్కడ పెంచుకున్నారన్న మాట కంటే అలా పెరగటానికి ఎన్టీఆరే కారణంగా చెప్పాలి.

రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్పిన ఎన్టీఆర్ లాంటి మహానేత కూడా ఒక భారీ తప్పు చేశారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తుంటారు. ఎందరో సామాన్యులకు రాజకీయ భిక్ష ప్రసాదించటమే కాదు.. అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్ కు మాత్రమే చెల్లుతుందని చెబుతారు. అలాంటి ఎన్టీఆర్ సొంత కుటుంబానికి సంబంధించి ఒక పెద్ద తప్పు చేశారని చెబుతారు. రాజకీయాల్లోకి తన కొడుకును మాత్రమే పరిచయం చేసిన ఆయన.. కూతుళ్లలో ఎవరిని పరిచయం చేయలేదు. కనీసం రాజకీయాల దగ్గరకు తీసుకురాలేదు.

కూతుళ్లను రాజకీయాల దగ్గరకు తీసుకురాని ఎన్టీఆర్.. వారి భర్తల్ని (అల్లుళ్లను) దగ్గరకు తీశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న అల్లుడు చంద్రబాబు (మొదట్లో ఆయన కాంగ్రెస్ లో ఉండేవారు)ను సైతం పార్టీలోకి వచ్చేందుకు ఓకే చెప్పేశారు. అయితే.. ఇంట్లోనే ఉన్న కుమార్తె పురంధేశ్వరిని ఆయన పట్టించుకోలేదని చెబుతారు. పురంధేశ్వరిని కానీ ఆయన తన రాజకీయ వారసురాలిగా ఎన్నుకొని ఉంటే.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరోలా ఉండేదన్న మాట వినిపిస్తుంటుంది. అయితే.. ఈ వాదనను చంద్రబాబును అభిమానించే వర్గం సుతారం ఇష్టపడరు.

అయితే.. 2004లో ఓటమి తర్వాత బాబు సామర్థ్యం మీద సందేహాలు రావటం.. అదే సమయంలో పురంధేశ్వరిలోని నేత జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం చూసిన వారు.. ఎన్టీఆర్ చేసిన తప్పును పదే పదే ప్రస్తావించేవారు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ఉన్న పురంధేశ్వరి ప్రత్యేక కారణాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టటం.. ఎంపీగా ఆమె సత్తా చాటటంతో పాటు.. కేంద్రమంత్రిగా తన ముద్ర వేయటంలో సక్సెస్ అయ్యారు.

ఇక.. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమిటన్నది చాలామందిని వేదించే ఓ పెద్ద ప్రశ్న. చంద్రబాబు తర్వాత అన్న వెంటనే పలువురు లోకేశ్ పేరును ప్రస్తావించినప్పటికీ.. సామాన్యుల్ని ఆకట్టుకునే మాస్ అప్పీల్ లోకేశ్ లో తక్కువన్నది నిష్ఠుర సత్యం. నిజానికి లోకేశ్ 2004 ఎన్నికల్లో చాలా పరిమితంగా.. 2009 ఎన్నికల్లో అపరిమితంగా.. 2014 ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించినప్పటికీ.. లోకేశ్ రావాల్సిన ఇమేజ్ రాలేదు.

ఆకట్టుకునేలా ఉండని ప్రసంగంతో పాటు.. ఆయన వైఖరిని అందరిని ఆకట్టుకునేలా ఉండదన్న విమర్శ ఉంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు తర్వాత.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అన్న మాట దగ్గర చాలావరకు చర్చ అసంపూర్ణంగా ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితి సగటు తెలుగు తమ్ముళ్లను ఇబ్బంది పెట్టేదే. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీకి మిగిలిన ప్రత్యామ్నాయాలు చూస్తే.. లోకేశ్ దగ్గరకు వచ్చి ఆగుతుందే తప్ప మరో మార్గం కనిపించదు. మరి.. తెలుగుదేశం లాంటిపార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు.. ఛరిష్మా లోకేశ్ కు ఉన్నాయా? అన్న ప్రశ్నకు తెలుగుదేశం నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.

పార్టీని నడిపే సామర్థ్యం విషయంలో లోకేశ్ ను వంకపెట్టటానికి వీల్లేదని చెబుతారు. ఈ విషయంలో నేతలందరి మాట ఒకేలా ఉంటుంది. కాకపోతే.. ప్రజల్ని సమ్మోహితుల్ని చేసే సామర్థ్యం లోకేశ్ లో ఉందా? అన్న విషయం దగ్గరే చర్చ మరోసారి ఆగుతుంది. మరి.. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? దీనికి మరో ప్రత్యామ్నాయం లేదా? అన్నది ఒక పెద్ద ప్రశ్న. అలాంటి సందేహం ఒక మోస్తరు నేతల నుంచి.. పార్టీలోని ముఖ్యనేతలందరిలోనూ ఉందని చెబుతారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనటమే కాదు.. నాడు ఎన్టీఆర్ ఏ తప్పు అయితే చేశారో.. అదే తప్పును చంద్రబాబు జరగకుండా చూస్తున్నారన్న మాట వినిపిస్తోంది. మరి.. చంద్రబాబు ఏం చేయనున్నారంటే..