Begin typing your search above and press return to search.

బాబు వ‌ద్ద‌కు బోయ‌పాటి!..మ్యాట‌రేంటో?

By:  Tupaki Desk   |   11 March 2019 10:27 PM IST
బాబు వ‌ద్ద‌కు బోయ‌పాటి!..మ్యాట‌రేంటో?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన వేళ‌... అన్ని రాజ‌కీయ పార్టీల కార్యాల‌యాలు సంద‌డిగా మారాయి. ఆశావ‌హుల‌తో పాటు కొత్త‌గా వ‌చ్చి చేరుతున్న నేత‌ల‌తో ఆయా పార్టీల అధినేత‌లు - కీల‌క నేత‌లు బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు మ‌రింత బిజీగా క‌నిపిస్తున్నారు. ఓ వైపు పార్టీలో కీల‌క నేత‌లుగా ఎదిగి... ఈ ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌సార‌థులుగా భావిస్తున్న వారంతా ఒకరి త‌ర్వాత మ‌రొక‌రుగా పార్టీ వీడ‌టంతో పాటుగా నేరుగా వైసీపీ కార్యాల‌యంలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుండ‌టంతో... వ‌ల‌స‌ల‌ను ఆపేందుకు చంద్ర‌బాబు నానా తంటాలు ప‌డుతున్నారు. అంతేకాక నిన్న ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో ఇంకా ఖ‌రారు కాని సీట్ల‌కు అభ్య‌ర్థుల వేట‌లో చంద్ర‌బాబు య‌మా బిజీగా క‌నిపిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో రాజ‌కీయాల‌కు అంత‌గా అవ‌స‌రం లేని వారు ఎవ‌రు వ‌చ్చిన పెద్ద‌గా ప‌ట్టించుకునే వీలే క‌నిపించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను... నేటి మ‌ధ్యాహ్నం అమ‌రావ‌తిలోని చంద్ర‌బాబు అధికార నివాసం వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. వ‌రుస ఫ్లాప్‌ల‌తో పాటు ఇటీవ‌లి విన‌య విధేయ రామ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డిన నేప‌థ్యంలో బోయ‌పాటి గ్రాఫ్ ఒక్క‌సారిగా దిగ‌జారిపోయింది. అస‌లు ఇప్పుడు బోయ‌పాటి పేరు వింటేనే అల్లంత దూరం ప‌రుగెడుతున్నారు. అలాంటి బోయ‌పాటి... నేడు చంద్ర‌బాబును క‌లిసేందుకు ఏకంగా హైద‌రాబాదు నుంచి విజ‌య‌వాడ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో బోయ‌పాటి ద‌ర్శనంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మొత్తంగా పొలిటిక‌ల్ కార్య‌క‌లాపాల‌కే టైం కేటాయిస్తున్న చంద్ర‌బాబు వ‌ద్ద‌కు బోయ‌పాటి ఏ కార‌ణంతో వ‌చ్చారోన‌న్న విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే టీడీపీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి చాలా కాలం నుంచే బోయ‌పాటి ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే క‌దా. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదలైన నేప‌థ్యంలో పార్టీ ప్ర‌చారంపై చ‌ర్చించ‌డానికే ఆయ‌న చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమాల్లో గ్రాఫ్ ప‌డిపోయిన త‌ర్వాత చంద్ర‌బాబు నివాసం వ‌ద్ద‌కు వ‌చ్చిన బోయ‌పాటి... అంద‌రి దృష్టిని ఆక‌ర్షించార‌నే చెప్పాలి.