Begin typing your search above and press return to search.

ఒంటరిగా ఉండలేక ఫ్రెండ్ ని సూట్ కేసులో తెస్తూ దొరికేశాడు

By:  Tupaki Desk   |   13 April 2020 5:00 AM GMT
ఒంటరిగా ఉండలేక ఫ్రెండ్ ని సూట్ కేసులో తెస్తూ దొరికేశాడు
X
సిత్రమైన ఉదంతాలెన్నో కరోనా పుణ్యమా అని చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో ఇప్పటివరకూ స్వేచ్ఛా విహంగాలుగా తిరిగిన ప్రజలు ఇళ్లకే పరిమితం కావటం బంధీలుగా భావిస్తున్న పరిస్థితి. బయటకు వస్తే ప్రాణాల మీదకు తెచ్చుకునే ముప్పును తక్కువగా అంచనా వేస్తూ.. కొందరు వ్యవహరిస్తున్న తీరు మిగిలిన వారికి తలనొప్పిగా మారుతోంది. తాజాగా వెలుగు చూసిన ఉదంతం ఇదే కోవలోకి వస్తుంది.

లాక్ డౌన్ నేపథ్యంలో కొత్తవారిని తమ ఊళ్లలోకి.. అపార్టుమెంట్లలోకి.. గేటెడ్ కమ్యునిటీలోకి అనుమతించని వైనం తెలిసిందే. మంగళూరులోని అర్యసమాజ్ రోడ్డు లో ఒక అపార్టుమెంట్ ఉంది. అందులోకి బయటవారిని లోపలకు అనుమతించకూడదన్న నిబంధనను పెట్టుకున్నారు. అయితే.. ఇందులో ఉండే ఒక యువకుడు లాక్ డౌన్ కారణంగా ఒక్కడే ఉండలేక పోయాడు. విపరీతమైన బోర్ కు గురి అవుతున్న పరిస్థితి. దీంతో.. భారీ ప్లాన్ వేశాడు.

తనకు ఆప్తుడైన మిత్రుడ్ని తన ఫ్లాట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా భారీ సూట్ కేసులో అతడ్ని దాచేసి కారులో తీసుకొచ్చాడు. అపార్ట్ మెంట్లోకి భారీ సూట్ కేసుతో వచ్చిన అతడ్ని అనుమానించిన అపార్టుమెంట్ వాసులు.. దాన్ని తెరవాలని కోరారు. అందుకు నో చెప్పటంతో మరింత అనుమానానికి గురయ్యారు. ఒత్తిడి మేరకు సూట్ కేసు తెరిచి చూస్తే.. అందులో స్నేహితుడ్ని రహస్యంగా తీసుకొస్తున్న వైనాన్ని గుర్తించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. కరోనా వేళ ఇలాంటి దరిద్రపుగొట్టు ఎత్తులు వేయాల్సిన అవసరం ఉందా? అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్నేహితుడ్ని రహస్యంగా తీసుకొచ్చిన వైనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.