Begin typing your search above and press return to search.

సెకండ్ హ్యాండ్ సెల్ కొని చిక్కుల్లో పడ్డది..తర్వాతేమైందంటే?

By:  Tupaki Desk   |   15 Nov 2020 11:45 AM IST
సెకండ్ హ్యాండ్ సెల్ కొని చిక్కుల్లో పడ్డది..తర్వాతేమైందంటే?
X
కొడుకు చదువు కోసం ఒక తల్లి పడిన ఆరాటం ఆమెను జైలు వరకు తీసుకెళ్లేలా చేసింది. ఎలాంటి తప్పు చేయకపోయినా చిక్కుల్లో పడిన ఆమె.. తాను పడిన కష్టం మొత్తం బూడిదలో పడేలా చేసింది. అయ్యో అనిపించే ఈ ఉదంతంలో ట్విస్టు ఏమంటే.. చివర్లో కథ సుఖాంతం కావటం. కాకుంటే.. దానికి ముందు ఆమె జీవితంలో ఎదురుకాని ఇబ్బందులు ఎదురయ్యాయి. అసలేం జరిగిందన్నది చూస్తే..

ముంబయిలోని బోరివ్లీకి చెందిన స్వాతి సుభాష్ సావ్రే అనే మహిళ తన కొడుకు ఆన్ లైన్ చదువుల కోసం సెల్ ఫోన్ కొనాలని ప్రయత్నించింది. అందుకోసం మూడునెలలు కష్టపడిన ఆమె.. ఎట్టకేలకు రూ.6వేల మొత్తాన్ని పోగు చేసింది. చివరకు సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ ను కొనుగోలు చేసింది. రిపేర్ కోసం మరో రూ.1500 ఖర్చు చేసింది.

అంతా బాగైందని సంతోషపడిన ఆమె.. సెల్ ఫోన్ లో సిమ్ కార్డు వేసింది. ఇది జరిగిన రోజు వ్యవధిలోనే ఆమె ఇంటికి పోలీసులు వచ్చారు. దొంగతనం చేశారంటూ ఆరోపించారు. ఆమెను రైల్వే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో.. షాక్ తిన్న ఆమెకు అసలేంజరిగందో అర్థం కాలేదు. పోలీసుల విచారణలో ఆమె సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనటం తప్ప.. ఎలాంటి తప్పు చేయలేదన్న విషయాన్ని గుర్తించారు.

ఆమె కొన్న సెకండ్ హ్యాండ్ ఫోన్ చోరీ చేసింది కావటం.. సిమ్ వేసిన వెంటనే.. సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా తేలటానికి ఒక రోజు పట్టగా.. ఆ రోజంతా ఆమె స్టేషన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాతి రోజు ఆమె తప్పు ఏమీ లేదని తేలటంతో ఇంటికి పంపారు. తీవ్రమైన అవమాన భారంతో ఇంటికి వచ్చిందామె. మరోవైపు తాను మూడు నెలల నుంచి కష్టపడి సంపాదించిన డబ్బులు పోవటమే కాదు.. కొడుకు చదువు కోసం సమకూర్చిన సెల్ లేకుండా పోయింది.

తనకు ఎదురైన చేదు అనుభవనాన్ని తాను అద్దెకు ఉండే ఇంటి యజమానికి చెప్పింది. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న ఇంటి యజమాని.. స్వాతి ఉదంతాన్ని ట్విట్టర్ లో ముంబయి పోలీసులకు పోస్టు చేశారు. దీనికి స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆమెను తమ వద్దకు పిలిపించి కొత్త ఫోన్ ను బహుమతిగా అందజేశారు. కొడుకు ఆన్ లైన్ క్లాసులకు అవసరమైన ఫోన్ ఎట్టకేలకు చేతికి రావటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలా మొత్తానికి కథ సుఖాంతమైంది. అందుకే.. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే వేళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.