Begin typing your search above and press return to search.

కొత్త కారు కొన్నాడు.. షోరూం మొదటి అంతస్తు నుంచి ఉరికించాడు

By:  Tupaki Desk   |   20 July 2021 4:52 AM GMT
కొత్త కారు కొన్నాడు.. షోరూం మొదటి అంతస్తు నుంచి ఉరికించాడు
X
కొత్తగా కారు కొనే వేళలో.. ఉత్సాహంతోపాటు.. అంతకు మించిన ఎంగ్జైటీ ఉంటుంది. కారు కలను తీర్చుకునే అందరిలోనూ కనిపించే ఉత్సాహం అత్యుత్సాహంగా మారితే ఏం జరుగుతుందన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఎల్ బీ నగర్ కు దగ్గర్లో చోటు చేసుకుంది. కొత్త కారును కొన్న ఉత్సాహంలో వెనుకా ముందు చూసుకోకుండా చేసిన పని పెను ప్రమాదానికి దారి తీసింది. సినిమాటిక్ సీన్ కు తగ్గట్లుగా చోటు చేసుకున్న ఈ ఉదంతంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అసలేం జరిగిందంటే..

ఎల్ బీ నగర్ కు దగ్గర్లోని అలకాపురి చౌరస్తాలో టాటా షోరూంలో కొత్త టియాగో కారును కొనుగోలు చేశారు మేడిపల్లికి చెందిన ఎల్ ఐసీ ఉద్యోగి 59 ఏళ్ల భగవంత్. భార్య పిల్లలతో కలిసి షోరూంకు వచ్చిన ఆయన.. తాను కొన్న కొత్త కారును చూసి మురిసిపోయారు. షోరూం మొదటి అంతస్తులో కారును నిలిపి ఉంచారు. దాన్ని ఒకసారి చూస్తానని కోరటంతో షోరూం ప్రతినిధులు ఓకే చెప్పారు. కాసేపు కారులో కూర్చున్న ఆయన కాసేపటికి దాన్ని స్టార్ట్ చేశారు.

ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పలేకపోతున్నప్పటికీ.. స్టార్ట్ చేసిన కారును ముందుకు ఊరికించటంతో ఒక్కసారిగా కారు మొదటి అంతస్తు నుంచి అమాంతం కిందకు పడిపోయింది. అక్కడి వారు చెబుతున్న దాని ప్రకారం.. కారులో కూర్చొని చూస్తానని చెప్పిన భగవంత్ కు కారును నడిపిన అనుభవం పెద్దగా లేదని చెబుతున్నారు. దీంతో.. కారును స్టార్ట్ చేసి.. ఎక్స్ లేటర్ ను రైజ్ చేశారు. అయితే.. కారు హ్యాండ్ బ్రేక్ వేసి ఉండకపోవటం.. కారు గేరులో ఉండటంతో ఒక్కసారిగా ముందుకు ఉరికింది.

మొదటి అంతస్తులో కారును కిందకు దించేందుకు ఉపయోగించే హైడ్రాలిక్ లిఫ్టు (దీనికి మూడు వైపులా ఇనుక కంచె ఉంటే ప్రమాద తీవ్రత చాలావరకు తగ్గేది) మీదుగా దూసుకెళ్లి.. గాల్లోకి ఎగిరి రోడ్డు మీద పడిపోయింది. ఈ కారు.. షోరూం మేనేజర్ కారు మీద పడి పల్టీ కొట్టింది. దీంతో.. కారులో ఉన్న భగవంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. షోరూం కింద ఉన్న మేనేజర్ కారును నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో.. గాయాలైన భగవంత్ ను ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదాన్ని చూసిన సిబ్బంది.. స్థానికులు షాక్ తిన్నారు.

షోరూం సిబ్బంది నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి అంతస్తులో కారును చూసేందుకు మాత్రమే అనుమతించాలని.. ఆన్ చేసేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదన్న మాట వినిపిస్తోంది. షోరూం మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొత్త కారు కొన్న సంబరం తర్వాత.. కారు కొన్న పెద్ద మనిషి ఆరోగ్యం కొలిక్కి వస్తే చాలన్న మాట వినిపిస్తోంది.