Begin typing your search above and press return to search.

అమరావతిలో బొత్స టూర్...ఆ బిల్డింగుల గురించేనా?

By:  Tupaki Desk   |   22 Jun 2020 4:43 PM GMT
అమరావతిలో బొత్స టూర్...ఆ బిల్డింగుల గురించేనా?
X
ఏపీలో మూడు రాజధానుల అంశం మరోసారి చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా మూడు రాజధానుల అంశం ప్రస్తావించారు. ఇక, అసెంబ్లీలోనూ మరోసారి మూడు రాజధానుల బిల్లు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపుపై మరో మంత్రి పెద్దిరెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని పెద్దిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన ఆసక్తి రేపుతోంది. అమరావతి పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించిన బొత్స వెంట సీఆర్డీఏ అధికారులు కూడా ఉండడం విశేషం. అంతేకాదు, గతంలో ప్రారంభించి ఆగిపోయిన నిర్మాణపనుల్ని బొత్స అధికారులతో కలిసి పరిశీలించారు. ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్‌వోడీఎస్ క్వార్టర్స్‌ను బొత్స పరిశీలించడంతో ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది.

గత రెండు రోజులుగా రాజధాని గ్రామాల్లో బొత్స పర్యటిస్తూ అక్కడి పెండింగ్ పనులపై దృష్టిసారించడం, స్ధానిక నేతలతో వ్యూహాత్మక సమావేశాలు జరపడం చర్చనీయాంశమైంది. రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఇన్‌టెక్‌వెల్ పనులు, కరకట్ట రోడ్‌ను పరిశీలించారు. ఆగిపోయిన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల ప్రతినిధులతోనూ బొత్స సమావేశమయ్యారు. అమరావతిలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు రూ.18 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బొత్స పెండింగ్ నిర్మాణాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అమరావతిలో పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని విస్మరించడం లేదనే సంకేతాలను రైతుల్లో పంపాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.

అందుకే పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా అమరావతిలోనూ అభివృద్ధి వదిలిపెట్టలేదనే సంకేతాలను విపక్షాలకు సైతం పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అమరావతిలోని పెండింగ్ పనులను పూర్తి చేసి వాటిలో ప్రభుత్వానికి అవసరమైన నిర్మాణాలను ఉంచుకొని...మిగతా నిర్మాణాలను ఆసక్తి ఉన్న ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వాదా వచ్చిన సొమ్ముతో ఖజానాను కొంత మేర భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శాసన రాజధాని అయిన అమరావతిలో అసెంబ్లీతో పాటు మరి కొన్ని నిర్మాణాలు మినహా వేరే వాటితో ప్రభుత్వానికి పెద్దగా పనిలేనందున జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.