Begin typing your search above and press return to search.

బాబు సవాలును కామెడీ చేస్తూ.. కీలకవ్యాఖ్యలు చేసిన బొత్స

By:  Tupaki Desk   |   7 Aug 2020 12:00 PM IST
బాబు సవాలును కామెడీ చేస్తూ.. కీలకవ్యాఖ్యలు చేసిన బొత్స
X
అందుకే అంటారు.. రాజకీయ అధినేత నోటి నుంచి వచ్చే మాట ఏదైనా సరే.. ఆచితూచి అన్నట్లుగా ఉండాలే కానీ.. వెనుకా ముందు చూసుకోనట్లుగా ఉండకూడదు. విషయం ఏదైనా కానీ సంచలన నిర్ణయాలు తీసుకునే సాహసం టీడీపీ అధినేత చంద్రబాబు చేయరని ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు చెబుతుంటారు. ఇప్పుడు అదే నిజంగా మారింది. ఏపీ రాజధానికి సంబంధించి.. 48 గంటల్లో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని.. లేదంటే.. అంటూ సవాలు విసిరిన బాబు.. తాను చెప్పిన గడువు పూర్తి అయిన తర్వాత కూడా గమ్ముగా ఉండటం గమనార్హం.

ఆవేశంతో మాటలు అన్నప్పటికీ.. వాటిని సీరియస్ గా అమలు చేసే విషయంలో బాబుకు చాలానే భయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. తాము ఆరోపిస్తున్నట్లుగా జగన్ పాలన విషయంలో ఏపీ ప్రజలు వ్యతిరేక భావనలో లేరన్న మాటను తెలుగు దేశం నేతలు తమ అంతర్గత సంభాషణల్లో ఒప్పుకుంటున్నారు. ఈ కారణంతోనే బాబు తన సవాలు విషయాన్ని మాట్లాడటం లేదంటున్నారు. బాబు పడుతున్న ఇబ్బందిని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గమనించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. విమర్శల వర్షం కురిపించారు.

నేరుగా విషయంలోకి వెళ్లిపోయిన ఆయన.. ఏం బాబు.. 48 గంటల సవాల్ విసిరావు.. ఏం చేశారు? చెప్పండంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబునిర్ణయాలు వ్యక్తిగత స్వార్థంతో ఉంటే.. తాము మాత్రం చట్టానికి లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమరావతి రాజధాని కాదని ఎవరు చెప్పారంటూ బాబును నిలదీసిన బొత్స.. రానున్న రోజుల్లో అమరావతిలోనూ పలు డెవలప్ మెంట్ యాక్టివిటీస్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అదే సమయంలో విశాఖలోనూ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లుగా చెప్పారు.

తన తాజా మాటలతో బొత్స ఒక్క విషయాన్ని క్లియర్ చేశారని చెప్పాలి. ఏపీ రాజధానిగా విశాఖ మాత్రమే కాదు..అమరావతి కూడా ఉందని.. దాన్ని కూడా తాము డెవలప్ చేయనున్నామని చెప్పటం ద్వారా.. ఆ ప్రాంత వాసుల్లో కొంత భయాందోళనలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. మొత్తంగా బాబు సవాలు పులిహోర అన్నట్లుగా తన మాటలతో బొత్స తేల్చేశారని చెప్పక తప్పదు.