Begin typing your search above and press return to search.

జక్కన్నకు పంచ్ లు తప్పలేదు

By:  Tupaki Desk   |   15 Sept 2019 12:19 PM IST
జక్కన్నకు పంచ్ లు తప్పలేదు
X
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ. చంద్రబాబు హయాంలో ఏపీ రాజధాని అమరావతికి సంబందించిన అంశాలపై ఆయన కూడా పాలు పంచుకోవటం తెలిసిందే. తొలుత యాక్టివ్ గా ఉన్నప్పటికీ తర్వాత మాత్రం ఆ ఇష్యూ నుంచి ఆయన బయటకు వచ్చేసినట్లు చెబుతారు. ఎంత గొప్ప దర్శకుడైనప్పటికీ.. రాజధాని అమరావతి ఎపిసోడ్ లో రాజమౌళి వేలెట్టి అనవసరమైన మరక మీద వేసుకున్నారన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బొత్స.. రాజమౌళిపై వ్యాఖ్యలు చేశారు. జక్కన్నపై నేరుగా విమర్శలు చేయనప్పటికీ.. గతంలో తాను తీసుకున్న నిర్ణయానికి బాధ పడేలా బొత్స మాటలు ఉన్నాయని చెప్పాలి.

సినిమాల్లో రాజమౌళి చాలా గొప్పవాడు కావొచ్చని.. కానీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది ఆయనకు తెలీదన్నారు. దర్శకత్వంలో దాసరి తర్వాతే రాజమౌళి అని.. ఎలాంటి సందేహం లేదన్న ఆయన.. ఏ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి? రాష్ట్ర పరిస్థితులు ఏమిటి? అన్న విషయాలు ఆయనకు తెలీవని చెప్పటం ద్వారా.. అమరావతి ఎపిసోడ్ లో ఆయన వేలెట్టి తప్పు చేశారన్న భావన కలిగేలా బొత్స వ్యాఖ్యలు ఉన్నాయి.

అమరావతి విషయంలో మిగిలిన వారి మాదిరి కాక.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రానికి ఏది అవసరమో దాన్నే చేస్తున్నారన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. దాసరి కంటే తాను గొప్పవాడినని రాజమౌళి ఎప్పుడూ చెప్పలేదే? అలాంటప్పుడు మన మధ్య లేని దాసరి ప్రస్తావన తేవటం.. జక్కన్నతో లింకు పెట్టటం వెనుక మర్మమేందంటారు?