Begin typing your search above and press return to search.

అమరావతి రైతుల సభకు ముందే బొత్స మార్క్ షాక్ .. ?

By:  Tupaki Desk   |   16 Dec 2021 1:30 PM GMT
అమరావతి రైతుల సభకు ముందే బొత్స మార్క్ షాక్ .. ?
X
అమరావతి మన రాజధాని, అదే ఏకైక రాజధాని అంటూ ఉత్సాహంగా నాలుగు జిల్లాలు దాటుకుని వందల కిలోమీటర్లను రోజుల తరబడి కొలుస్తూ అమరావతి రైతులు మహా పాదయాత్ర చేశారు. చివరికి వారు అనుకున్నట్లుగానే తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించుకుంటున్నారు. దానికి హై కోర్టు కూడా అనుమతి ఇచ్చేసింది.

ఇక కొద్ది గంటలలో సభ. అంతా సాఫీగా సాగుతోంది అన్న సంతోషంతో అమరావతి రాజధాని పాదయాత్రీకులు ఉన్న వేళ ఉరమని పిడుగులా హఠాత్తుగా సీన్ లోకి వచ్చేసిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వారికి భారీ షాక్ ఇచ్చేశారు. అమరావతి రైతుల కాలి కష్టానికి ప్రతిఫలం ఇదే అంటూ తేల్చేశారు. కధ ఇలాగే జరుగుతుంది. ఇదే సత్యం ఇదే నిజమని అంటూ కుండబద్ధలు కొట్టారు.

అది అమరావతి రైతుల సభ కాదు, ఫక్తు టీడీపీ సానుభూతిపరుల సభ అంటూ బాంబులే పేల్చారు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్న రాజకీయ సభ అని కూడా ఎండగట్టారు. అమరావతి రాజధాని ముసుగులో తెలుగుదేశం ఆడుతున్న వికృత రాజకీయ క్రీడ అని కూడా బొత్స గట్టిగానే సౌండ్ చేశారు.

వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని ఎక్కడైనా ఎన్నికల మ్యానిఫేస్టోలో చెప్పామా అంటూ బొత్స అనడమూ విశేషమే. అంతే కాదు, అలా కనుక ఎన్నికల ముందు తాము అంటే దాన్ని చూపించాలని కూడా సవాల్ చేశారు. తమకు అమరావతి మీద ఎలాంటి ద్వేషం లేదని, దాన్ని శాసన రాజధానిగా కొనసాగిస్తామని, అదే సమయంలో మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తామని, ఇదే తమ విధానమని కూడా బొత్స స్పష్టం చేశారు.

మూడు రాజధానుల చట్టం రద్దు అయింది అని సంబరపడొద్దు, అందులో సాంకేతికపరమైన అంశాలను సరిదిద్దుకుని సమగ్రమైన బిల్లుతో మళ్లీ ముందుకు వస్తామని బొత్స చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని, దానికే కట్టుబడి ఉంటామని కూడా ఆయన పేర్కొనడం అంటే మహా పాదయాత్ర వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేల్చేసినట్లే అంటున్నారు.

అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, అందుకే తమ ప్రభుత్వం పదమూడు జిల్లాలకు న్యాయం చేయడానికి సిద్ధపడుతోందని బొత్స అన్నారు. ఈ విషయంలో రెండవ మాటకే తావు లేదని ఖరాఖండీగా చెప్పేశారు. మొత్తానికి బొత్స ఇలా క్లారిటీగా అంతా చెప్పేశాక రేపటి అమరావతి రైతుల సభ తిరుపతిలో ఎంత సక్సెస్ అయినా కూడా ఆ వచ్చే ఆనందం మీద ముందే నీళ్ళు కుమ్మరించేశారు అంటున్నారు. మొత్తానికి పాదయాత్ర చేసి వచ్చిన అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకునే వారికి ఈ రోజు రాత్రే నిద్ర పట్టకుండా బొత్స చేశారు అని కామెంట్స్ వస్తున్నాయి.