Begin typing your search above and press return to search.

మరో బాంబు పేల్చిన బొత్స.. ఎవరి గడ్డమైనా పట్టుకుంటాం

By:  Tupaki Desk   |   15 Feb 2020 11:05 AM IST
మరో బాంబు పేల్చిన బొత్స.. ఎవరి గడ్డమైనా పట్టుకుంటాం
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. రోజు విడిచి రోజు వ్యవధిలోనే ఢిల్లీకి జగన్ వెళ్లడంతో రాష్ట్రంలో పలు ప్రశ్నలు వస్తున్నాయి. అకస్మాత్తుగా ఢిల్లీ ఎందుకు వెళ్లారు? జగన్ అడగ్గానే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం.. అనంతరం అమిత్ షాతో భేటీ తదితర అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ కేంద్రంతో చేతులు కలుపుతుందని, త్వరలోనే కేంద్రంలో జగన్ భాగస్వామిగా మారతాడని, ఆ నేపథ్యంలో తన సోదరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమనే పుకార్లు వచ్చాయి. అయితే వీటిపై విశాఖపట్టణంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన గతంలో రాజధానిపై బాంబు పేల్చగా ఇప్పుడు ఈ అంశం పై కూడా బాంబు పేల్చడంతో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాటలు ఎప్పుడు స్పష్టంగా ఉండకపోగా సందేహాలకు ఇంకా బలం చేకూర్చేలా ఆయన మాటలు ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేంద్రంలో కలిసేలా ఉన్నట్టు పరోక్షం గా తెలుస్తోంది.

తన మాటలతో ప్రజలందరూ ఆ పుకార్లు నిజమేనేమో అనుకునే పరిస్థితిని బొత్స కల్పిస్తున్నారు. కేంద్రంలో చేరాలనే ప్రతిపాదన వస్తే.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం అని బొత్స ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి గడ్డమైనా పట్టుకోడానికి తాము సిద్ధంగా ఉంటాం అని కూడా తెలపడంతో పుకార్ల కు బలం చేకూరింది. దీంతో పాటు కేంద్రం తో ఎందుకు ఘర్షణ పడాలని ప్రశ్నించారు. వీటిని గమనిస్తుంటే త్వరలోనే కేంద్రంలో వైఎస్సార్సీపీ చేరే అవకాశం ఉందని బలంగా తెలుస్తోంది.

జగన్ అత్యంత సన్నిహితుడుగా, పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేయడంతో వాస్తవమే అయ్యిండొచ్చు. ఎందుకంటే గతంలో రాజధాని మార్పు విషయంలో బొత్స ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వెంటనే కొన్నాళ్లకు ఆయన చెప్పిందే నిజమైంది. రాజధానిని మార్చేశారు. ఇప్పుడు కేంద్రంలో చేరే విషయం కూడా మాట్లాడడంతో వైఎస్సార్సీపీ బీజేపీతో దోస్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రానికి ఆశించిన మేరకు కేంద్రం నుంచి సహాయం అందడం లేదు. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి అదనపు సహాయం అందించాలి. కానీ కేంద్రం ఉన్న నిధులు చెల్లించక పోవడమే గగనమైంది. ఈ నేపథ్యం లో రాజకీయంగా సహకరిస్తే ఏపీకి మేలు జరుగుతుందనే ఆశతో జగన్ కేంద్ర ప్రభుత్వం లో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఉగాది లోపు జరిగే అవకాశం ఉంది.