Begin typing your search above and press return to search.

రాజధానిపై బొత్స మరో ఆసక్తిదాయక ప్రకటన!

By:  Tupaki Desk   |   18 Oct 2019 8:18 AM GMT
రాజధానిపై బొత్స మరో ఆసక్తిదాయక ప్రకటన!
X
ఇప్పటికే రాజధాని అంశంపై మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనలు దుమారం రేపాయి. అమరావతి నుంచి రాజధానిని మార్చేయోచన ఉన్నదన్నట్టుగా బొత్స సత్తిబాబు ప్రకటించారు. ఆ విషయంపై ప్రభుత్వం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ అంశం మీద స్పందించలేదు. ఇలాంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మరో సారి ఆ అంశం గురించి ఒకింత సంచలన ప్రకటనలాంటిదే చేశారు.

రాజధాని ఎక్కడుండాలనే అంశం గురించి అధ్యయనం చేయబోతున్నట్టుగా సత్తిబాబు ప్రకటించడం విశేషం. రాజాధాని ఎక్కడుండాలి అనే అంశం గురించి ఒక నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని, అది ప్రజలను కలుస్తుందని బొత్స ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఆ కమిటీ పర్యటనలు మొదలవుతాయని అన్నారు.

అలా కమిటీ ఇచ్చే నివేదికను బట్టి రాజధాని ఎక్కడుండాలే అంశాన్ని నిర్ణయించబోతున్నట్టుగా బొత్స ప్రకటించడం గమనార్హం. రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండాలని కొన్ని డిమాండ్లున్నాయని, రాయలసీమ, ఉత్తరాంధ్రల నుంచి కూడా ఆ విషయంలో డిమాండ్లు ఉన్నాయన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని అనుసరించి నిపుణుల కమిటీ నివేదికను తయారు చేస్తుందని బొత్స అన్నారు.

అమరావతిలో రాజధాని నిర్మాణం బాగా వ్యయ భరితం అని కూడా మంత్రి వ్యాఖ్యానించడం విశేషం. భారీ భవంతుల నిర్మాణానికి చాలా లోతుగా పునాదులు తీయాల్సి వస్తోందని, కనీసం వంద అడుగుల లోతుకు పునాదులు తీయాల్సిన అవసరం కూడా కనిపిస్తోందన్నారు. దీని వల్ల భారీ వ్యయం అవుతుందని.. రాజధాని నిర్మాణంలో భవనాల నిర్మాణానికి అలా ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తోందన్నారు.

అందుకే మార్పు ఉండబోతోందన్నట్టుగా బొత్స ప్రకటించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, అప్పటి మంత్రి నారాయణకు తోచినట్టుగా రాజధానిని ప్రకటించారన్నారు. ఆయన నిపుణుడా అని ప్రశ్నించారు.

మొత్తానికి రాజధాని అంశం గురించి బొత్స సత్యనారాయణ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలే చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనలు లేకపోయినా ఈ మంత్రి మాత్రం మాట్లాడుతుండటం గమనార్హం.