Begin typing your search above and press return to search.

బొత్స మళ్లీ హాట్ టాపిక్ అయ్యారుగా?

By:  Tupaki Desk   |   27 Jan 2021 10:00 PM IST
బొత్స మళ్లీ హాట్ టాపిక్ అయ్యారుగా?
X
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైన ముద్రను వేసిన నేతల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. అసలుసిసలు రాజకీయ నేతకు నిలువెత్తు రూపంగా ఉండే ఆయన.. అధికారం కోసం దేనికైన సై అనే తత్త్వం ఆయన సొంతం. దివంగత మహానేత వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన.. అప్పట్లో ఆయన హవా అంతా ఇంతా కాదన్నట్లుగా ఉండేది. అధినేతకు దగ్గరగా ఉండటం.. అధిష్ఠానానికి విశ్వసనీయమైన నేతగా నిలవటమే కాదు.. ఢిల్లీ స్థాయిలో ఎవరికి ఏం కావాలో బొత్స గుర్తించినంత బాగా మరెవరూ గుర్తించరని చెబుతారు.

రాష్ట్ర మంత్రిగా చక్రం తిప్పిన ఆయన.. అప్పట్లోనే తన భార్యను ఎంపీ కుర్చీలో కూర్చోబెట్టటం.. ఒక సోదరుడ్ని ఎమ్మెల్యేను చేయటం.. ఇలా విజయనగరం జిల్లాలో తనకు తిరుగులేని రాజకీయ అధిక్యతను ప్రదర్శించేవారు.జిల్లాలో ఎక్కడ చూసినా బొత్స కుటుంబమే కనిపించేది. అలాంటి ఆయన తర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. ఆయన ఒక్కగానొక్క కొడుకు అంటే పంచ ప్రాణాలుగా చెబుతారు. చదువుకునే రోజుల నుంచి మొన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉంచిన తన కొడుకును.. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఆయన పడుతున్న తపన అంతా ఇంతా కాదు.

ఇప్పటికే ఎందరికో రాజకీయ జీవితాన్ని.. అధికారాన్ని ఇప్పించిన బొత్స.. తాజాగా తన కొడుకును గ్రాండ్ గా లాంఛ్ చేయాలని భావిస్తున్నారు. డాక్టర్ గా పని చేస్తున్న తన కొడుకు సందీప్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంట్లో పడేందుకు ఆయన పడుతున్న తిప్పలు అన్నిఇన్ని కావు. ఈ మధ్యనే సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. తన కొడుకును వెంట పెట్టుకొని వచ్చి మరీ అతడి చేత రక్తదానాన్ని ఇప్పించాడు. ఆ సందర్భంలో సీఎం జగన్ కు తన కొడుకును పరిచయం చేశాడు.

మాంచి పదవుల్లో తండ్రి రాజకీయ చక్రం తిప్పుతున్నా.. బొత్స కొడుకు సందీప్ మాత్రం వాటి వంక చేసేవాడు కాదని చెబుతారు. బొత్స మాదిరి కాదని.. ఆయన కొడుకు తీరుకాస్త భిన్నమని చెబుతారు. అయితే.. మొన్న తన పుట్టిన రోజు సందర్భంగా విజయనగరం వ్యాప్తంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బొత్స.. అందులో తన కొడుకును భారీగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును రాజకీయ వారసుడిగా బరిలోకి దించాలన్న కచ్ఛితమైన ప్లానింగ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. బొత్స ప్లానింగ్ ఏ మేరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.కొడుకు విషయంలో బొత్స పడుతున్న ఆరాటం.. జిల్లా రాజకీయాల్లో ఆయన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.