Begin typing your search above and press return to search.

జగన్ సర్కారుపై విరుచుకుపడిన బొప్పన నోట షాకింగ్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   1 Feb 2022 5:49 AM GMT
జగన్ సర్కారుపై విరుచుకుపడిన బొప్పన నోట షాకింగ్ వ్యాఖ్యలు
X
కొద్ది రోజుల క్రితం కొత్త పీఆర్సీ ప్రకటన కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశానికి హాజరు కావటంతో పాటు.. పీఆర్సీ ప్రకటన వేళ.. చంకలు గుద్దుకొని.. అద్భుతమైన ప్రకటన అంటూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇప్పుడు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్సీ సాధన సమితి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి ఛైర్మన్ గా కూడా పని చేస్తున్నారు. కొత్త పీఆర్సీ పేరుతో జగన్ సర్కారు చేసిన ప్రకటనపై తీవ్ర ఆగ్రహాన్నిప్రకటిస్తున్న ఆయన.. ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని ఈ నెల మూడున నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ చలో విజయవాడకు లక్షలాదిగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన బొప్పరాజు..మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు.

ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చూసిన తర్వాతైనా జగన్ ప్రభుత్వంలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పిన బొప్పిరాజు.. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని.. కార్మిక.. ఉపాధ్యాయులు.. పెన్షనర్లకు అవగాహన కల్పించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేమిటన్నది చూస్తే..

- వాట్సాప్, సోషల్ మీడియాలో ఉద్యోగులపై దుష్ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని చర్చలకు పిలిచినట్లు.. మేమేదో రహస్యంగా కొన్నింటికి ఒప్పుకున్నట్లు.. హెచ్ఆర్ఏ శ్లాబులు ఇస్తున్నట్లుతప్పుడు వార్తలు రాసి పంపిస్తున్నారు. తప్పుడు ప్రచారం కోసమే కొందరిని నియమించుకున్నారు. ఇలాంటి వార్తల్ని ఎవరూ నమ్మొద్దు. అందరూ ఐక్యంగా పోరాడాలి.

- పీఆర్సీపై ఉద్యోగులు- ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రణాళిక ప్రకారం ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆశిస్తున్నా.

- ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ఇది అటవిక రాజ్యం కాదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తేనే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. అంతేకానీ కక్షసాధింపు ధోరణితో అధికారులపై చర్యలు తీసుకోకూడదు.

- మాకు న్యాయసలహాలు ఇచ్చేందుకు రవిప్రసాద్, సత్యప్రసాద్ అనే న్యాయవాదులను నియమించుకున్నాం.

- మా మూడు ప్రధాన డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చకు వస్తాం. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశాం. చర్చలకు రావాలని ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. లిఖితపూర్వకంగా ఆహ్వానిస్తేనే చర్చలకు వెళతాం.

- ఉద్యోగుల జీతాలపై ట్రెజరీ అధికారులను బెదిరిస్తూ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. మెమోలు జారీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది.

- అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయటం లేదు? ఆ నివేదికలో ఉన్న రహస్యం ఏమిటి?