Begin typing your search above and press return to search.

ధర్మసందేహం? బూస్టర్ డోసుల మాటేంటి?

By:  Tupaki Desk   |   21 Aug 2021 9:26 AM IST
ధర్మసందేహం? బూస్టర్ డోసుల మాటేంటి?
X
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరి ఆలోచనలు పూర్తిగా మారిపోయింది. ఆ మాటకు వస్తే గమనమే మారిందని చెప్పక తప్పదు. ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ముఖానికి మాస్కు.. చేతికి శానిటైజర్ తో పాటు.. వ్యాక్సిన్ వేయించుకోవటాలు.. డాక్టర్ చెకప్ లు.. కాస్తంత అనుమానం వస్తే చాలు.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఇలాంటివి కామన్ గా మారిపోయాయి. మొదట్లో ఇదంతా ఏ మూడు నెలలో.. ఆర్నెల్ల పాటు ఉంటుందని భావించినా.. ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. నిపుణుల మాటలు వింటుంటే.. మరో ఏడాదికి పైనే ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పక తప్పదు.

సాధారణంగా అన్ని వ్యాక్సిన్లు వేసుకుంటే.. సదరు మహమ్మారి రాకుండా ఉంటుంది. అంటే.. ఆ వ్యాక్సిన్లు వాటిని అడ్డుకుంటాయన్న మాట. కానీ.. కరోనా టీకా లెక్క వేరు. ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా రాదన్న గ్యారెంటీ ఏమీ ఉండదు. కాకుంటే.. దాని తీవ్రత మరింత ఎక్కువగా కాకుండా.. తక్కువ తీవ్రత ఉండే వీలుంది. అంతేకాదు.. ప్రాణహాని నుంచి తప్పించుకునే వీలుంది. ఈ కారణంతో వ్యాక్సిన్ వేసుకోవటం తప్పనిసరి అని చెబుతున్నారు.

ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది ఒక డోసు వేసుకున్న వారు కోట్లల్లో ఉన్నారు. రెండో డోస్ ను కూడా అదే స్థాయిలో వేసే ప్రయత్నంలో ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. .ఇదిలా ఉంటే.. రెండు డోసులు వేసుకున్న వారు.. బూస్టర్ డోస్ గురించి ఆలోచనలు మొదలు పెట్టారు. మరికొందరైతే రెండు వేర్వేరు వ్యాక్సిన్లను వేసుకోవటం ద్వారా.. కరోనా తీవ్రతను తగ్గించొచ్చన్న మాట వినిపిస్తోంది. మరి.. వీరి మాటలకు నిపుణులు ఏమంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బూస్టర్ డోసుల కోసం వెర్రిగా వెళితే.. ఆశించిన ప్రయోజనం ఉండదన్నది ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే.. వేర్వేరు వ్యాక్సిన్లు కలపటంపై పరిశోధనలు జరుగుతున్నాయని.. ఈ ఏడాది చివరకు కానీ స్పష్టత రాదని చెబుతన్నారు. ఒకసారి టీకా వేసుకుంటే ఏడాది నుంచి రెండేళ్ల వరకు రక్షణ ఉంటుందన్న అంచనాను నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్ బయటకు వచ్చి ఏడాదిన్నర మాత్రమే కావటం.. భారత్ లోవ్యాక్సిన్లు వేయటం మొదలు పెట్టి ఎనిమిది నెలలే కావటంతో.. బూస్టర్ డోసుల మీద తొందరపాటు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. రెండు డోసుల తర్వాత వ్యాక్సిన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని.. అందుకే తొందర వద్దంటున్నారు. అంతేకాదు.. రెండు భిన్నమైన వ్యాక్సిన్లు వేసుకోవటం సరికాదని.. దీనిపై శాస్త్రీయ ఆధారాలు ఇంకా రాలేదని చెబుతున్నారు. అందుకే బూస్టర్ డోసుల విషయంలోనూ.. వ్యాక్సిన్ మిక్సింగ్ విషయంలోనూ ప్రయోగాలకు వెళ్లకుండా ఉండటం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.