Begin typing your search above and press return to search.

మునుగోడులో గులాబీ బాస్ కు సన్నిహితుడి షాక్.. టికెట్ రేసులోకి దూసుకొచ్చాడు

By:  Tupaki Desk   |   15 Sep 2022 5:10 AM GMT
మునుగోడులో గులాబీ బాస్ కు సన్నిహితుడి షాక్.. టికెట్ రేసులోకి దూసుకొచ్చాడు
X
కేసీఆర్ ను అర్థం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆయనకు దూరంగా ఉన్న వారు ఆయన మైండ్ సెట్ ను అర్థం చేసుకోలేదంటే అదో అర్థం ఉంటుంది. కానీ.. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగి.. మాజీ ఎంపీగా సుపరిచితుడైన నేత.. కేసీఆర్ కు కాలే పనులు చేస్తున్న వైనం ఒక ఎత్తు అయితే.. తన మాటలతో తనకెంతో దగ్గరైన ముఖ్యమంత్రికి తలనొప్పి తెచ్చి పెడుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారటం తెలిసిందే.ఈ ఉప పోరుకు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారో తెలీకున్నా.. నియోజకవర్గంలో పరిస్థితులు రాజకీయ పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఉప పోరులో అధికార పార్టీ అభ్యర్థిగా పలువురి పేర్లు వినిపిస్తున్న వేళ.. తాజాగా మాజీ ఎంపీ.. కేసీఆర్ కు సన్నిహితుడైన బూర నర్సయ్య గౌడ్ రేసులోకి వచ్చేసిన వైనం కలకలంగా మారింది.

సౌమ్యుడిగా పేరున్న ఈ డాక్టర్ గారు.. ప్రెస్ మీట్ పెట్టేసి మరీ టికెట్ తనకే ఇవ్వాలంటూ గళం విప్పిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే గులాబీ బాస్ కు ఇష్టం ఉండదో.. సరిగ్గా అదే పని చేస్తున్న నర్సయ్య వైనం ఇప్పుడు ఒక పట్టాన మింగుడుపడటం లేదు. మునుగోడు ఉప పోరు వేళ.. పార్టీ టికెట్ కోసం ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. దీంతో ఎవరికి వారు తమకే టికెట్ కావాలని కోరుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. టికెట్ కోసం ఆశ పడుతున్న వారందరికి ఒక తాటి మీదకు తెచ్చి.. వారిని సముదాయించి.. అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి పని చేయాలని కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

ఇలాంటి వేళలో అనూహ్యంగా తెర మీదకు వచ్చిన బూర నర్సయ్య.. ఎప్పుడూ అగ్ర వర్ణాలకేనా.. బీసీలకు టికెట్ ఇవ్వరా? అంటూ ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. ''ఎప్పుడూ రెడ్లు.. వెలమలే ఎమ్మెల్యేలు కావాలా? బీసీలకు అవకాశం ఇవ్వరా?' అని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్ని జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసినవే అన్న ప్రచారం సాగుతోంది. భువనగిరి ఎంపీగా 2014లో గెలిచిన బూర 2019లో జరిగి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కావటం తెలిసిందే.

మూడేళ్లుగా ఖాళీగా ఉన్న ఆయన చూపు ఇప్పుడు మునుగోడు మీద పడింది. దీనికి తోడు సదరు నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉన్న కారణంతో అదే అంశాన్ని ఎజెండా చేసుకొని మరీ టికెట్ రేసులోకి వచ్చేవారు. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్లకే ఇస్తున్న వార్త బయటకు వచ్చి వేళ.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ మీటింగ్ పెట్టిన వైనం అప్పట్లో సంచలనంగా మారింది కదా.. ఆ మీటింగ్ బూర పుణ్యమేనని చెబుతున్నారు.

మరోవైపు బూర కోసం కాంగ్రెస్ వల విసిరినట్లు చెబుతున్నారు. అయితే.. గెలుపు మీద ఉన్న సందేహంతో టీఆర్ఎస్ లోనే ఉన్న ఆయన.. మునుగోడు టికెట్ ను సొంతం చేసుకోవాలని తపిస్తున్నారు. ఇందుకోసం ఆయన వేస్తున్న అడుగులు.. చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారటంతో పాటు.. గులాబీ అధినాయకత్వానికి ఇప్పుడో తలనొప్పిగా మారినట్లుగా చెబుతున్నారు. తనను ఇబ్బందికి గురి చేస్తున్న బూరకు.. ఆయన కోరుకున్నట్లు కేసీఆర్ టికెట్ ఇస్తారంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.