Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను త‌ప్పు దారి ప‌ట్టేలా బూర లాంటోళ్ల వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   21 Oct 2018 12:02 PM GMT
కేసీఆర్ ను త‌ప్పు దారి ప‌ట్టేలా బూర లాంటోళ్ల వ్యాఖ్య‌లు!
X
టీఆర్ ఎస్ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నేం వ్యాఖ్య‌లు చేశార‌న్న విష‌యాన్ని చెప్ప‌కునే ముందు.. కొన్ని ముఖ్య‌మైన విష‌యాల్ని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. వాతావ‌ర‌ణం అంతా త‌మ‌కు అనుకూలంగా ఉంద‌న్న ఉద్దేశంతో తొమ్మిది నెల‌ల ముందే అసెంబ్లీని ర‌ద్దు చేయ‌టం ద్వారా.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెర తీసిన వైనం తెలిసిందే. అన్నీ త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌న్న భావ‌న కేసీఆర్ క‌ల‌గ‌టానికి కార‌ణం ఆయ‌న చేయించిన స‌ర్వేల‌తో పాటు.. ఆయ‌న‌కు స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించే నేత‌లే కార‌ణంగా చెప్పాలి.

త‌న‌ను క‌లిసిన వారంతా కేసీఆర్‌ కు గొప్ప‌లు చెప్ప‌టానికి.. ఆకాశానికి ఎత్తేయ‌టానికే త‌ప్పించి మరో అంశం మీద దృష్టి సారించ‌లేని ప‌రిస్థితి. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారంతా చెప్పే మాట‌లు.. త‌న‌ను తాను గొప్ప‌గా ఫీల‌య్యే కేసీఆర్ లో కాన్ఫిడెన్స్ ను మ‌రింతగా పెంచ‌టంతో పాటు.. గ్రౌండ్ లెవ‌ల్లో ఏం జ‌రుగుతుందో అన్న విష‌యాల్ని తెలుసుకునే విష‌యంలో కేసీఆర్ త‌ప్పులో కాలేశార‌ని చెప్పాలి.

అసెంబ్లీని రద్దు చేసి.. ముంద‌స్తుకు వెళ్లిన త‌ర్వాత నుంచి గ్రౌండ్ లెవ‌ల్లో కేసీఆర్ స‌ర్కారు మీద ఉన్న వ్య‌తిరేక‌త ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తోంది.ప‌లువురు నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వెళుతుంటే.. సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌ట‌మే కాదు.. కేసీఆర్ త‌మ‌కు ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చుకోలేద‌న్న మాట‌ను ముఖం మీద‌నే అడిగేస్తున్న ప‌రిస్థితి.

ఇక‌.. సోష‌ల్ మీడియాలో అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కేసీఆర్ తీరును.. ఆయ‌న మాట‌ల్ని తిట్టి పోస్తున్న వారు.. కేసీఆర్ త‌ర‌హాలో మాట్లాడుతూ.. ఆయ‌న‌కు పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. కొన్ని వీడియోల్లో కేసీఆర్ మాట‌ల‌కు స‌గ‌టు జీవులు ఇస్తున్న పంచ్ లు.. సంధిస్తున్న ప్ర‌శ్న‌ల్ని చూస్తే.. గులాబీ నేత‌లు సైతం విస్మ‌యానికి గుర‌య్యే ప‌రిస్థితి.

గ‌తంలో భావోద్వేగంతో కూడిన వ్యాఖ్య‌లు చేస్తే.. ఎవ‌రూ చ‌ప్పుడు చేయ‌ని ప‌రిస్థితి. ఇప్పుడు అందుకు భిన్నంగా భావోద్వేగంతో మాట్లాడి.. మ‌మ్మ‌ల్ని త‌ప్పు దారి ప‌ట్టిద్దామ‌ని కుట్ర ప‌న్నుతావా? అని నేరుగా క‌డిగేస్తున్న ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. తొమ్మిది నెల‌ల ప‌ద‌వీ కాలాన్ని అన‌వ‌స‌రంగా వ‌దులుకున్నామా? అన్న సందేహం గులాబీ ద‌ళంలో అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికి త‌మ తీరును మార్చుకోని గులాబీ నేత‌లు.. త‌మ అధినేత గురించి చేస్తున్న వ్యాఖ్య‌లు.. ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం చూసిన‌ప్పుడు.. కేసీఆర్ ను వారు త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఎవ‌రిదాకానో ఎందుకు ఎంపీ బూర న‌ర‌స‌య్య గౌడ్ వ్య‌వ‌హార‌మే చూడండి.. ఆయ‌న తాజాగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప‌రిస్థితి చాలా మెరుగ్గా ఉండ‌ద‌ని.. క్షేత్ర స్థాయిలో గులాబీ పార్టీకే ప్ర‌జ‌లంతా అనుకూలంగా ఉన్నార‌ని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి సంక్షేమ ప‌థ‌కాలు చేరాయ‌ని.. వారిలో 30 శాతం మంది ఓట్లు వేసినా టీఆర్ఎస్ ఘ‌న విజ‌యాన్ని సాధిస్తుంద‌ని చెబుతున్నారు.

అసెంబ్లీ ర‌ద్దు అయినా.. 14 మంది ఎంపీలు ఉన్నార‌ని.. వారంతా క‌లిసి ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుంటార‌న్నారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునే బాధ్య‌త ఎంపీల మీద ఉంద‌న్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కేసీఆర్ ఒక్క‌సారి రంగంలోకి దిగితే పరిస్థితి మొత్తం మారిపోతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ రోజు (ఆదివారం) టీఆర్ఎస్ 105 మంది అభ్య‌ర్థుల‌తో క‌లిసి కేసీఆర్ స‌మావేశం కానున్నార‌ని.. ఇప్ప‌టికే వారికి సంబంధించిన స‌ర్వే రిపోర్టుల‌ను ఆయ‌న తెప్పించుకున్నార‌ని.. వాటిని ప‌రిశీలించిన ఆయ‌న‌.. అభ్య‌ర్థుల‌తో ఆయ‌న మాట్లాడ‌నున్నార‌ని చెబుతున్నారు. బూర మీదిరి అభ్య‌ర్థులు సైతం క్షేత్ర‌స్థాయిలో బ్ర‌హ్మండంగా ప‌రిస్థితి ఉంద‌న్న మాట‌ను చెబితే.. ఇక అంతే సంగ‌తులు అంటున్నారు. బూర మాదిరి ఎత్తేసే మాట‌లు.. పిసుకుడు మాట‌లు వ‌దిలేసి.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా.. ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త గురించి కేసీఆర్ తో ఓపెన్ గా చెబితే మంచిద‌న్న అభిప్రాయం ప‌లువురి నోట వినిపిస్తోండ‌టం గ‌మ‌నార్హం.