Begin typing your search above and press return to search.

కేసీఆర్ సీఎం ప‌ద‌వి చేప‌ట్ట‌రంటున్న ఎంపీ

By:  Tupaki Desk   |   29 Jan 2017 7:05 AM GMT
కేసీఆర్ సీఎం ప‌ద‌వి చేప‌ట్ట‌రంటున్న ఎంపీ
X
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా వార‌స‌త్వ పోరు నెల‌కొంద‌నే వార్త‌ల‌పై ఆ పార్టీ నేత‌ - భువనగిరి లోక్‌ సభ సభ్యులు బూర నర్సయ్యగౌడ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌డంతోనే ఇంకా క‌న్ఫ్యూజ్ ఎక్కువ అయింద‌ని అంటున్నారు. అసెంబ్లీలోని టీఆర్‌ ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆరే ప్రభుత్వానికి - పార్టీకి ఉన్న ఏకైక బాస్‌ అని బూర న‌ర్స‌య్య గౌడ్ అన్నారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యులైన కేటీఆర్‌ - కవితలు ముఖ్యమంత్రి పదవి కోసం అంతర్గత సంఘర్షణ పడుతున్నారనడం సరికాదన్నారు. 2019లో కూడా కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారా విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా... అది కాలం నిర్ణయిస్తుందని, కేసీఆర్‌ ఎవరిని నియమిస్తే వారే సీఎం అవుతారని చెప్పారు. 2019లో కేసీఆర్‌ నిర్ణయించిన వారే ముఖ్యమంత్రిగా ఉంటారని అనడంతో, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ నెగ్గితే మరోసారి సీఎం పగ్గాలు చేపట్టబోరా ? అన్న చర్చకు తెరలేచింది.

ప్రజల అండతోనే కేసీఆర్‌ సీఎం అయ్యారని, కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నట్టుగా సోనియా గాంధీ వల్ల కాదని బూర న‌ర్స‌య్య గౌడ్‌ అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ చొరవ జాతీయ రాజకీయాల్లోనూ పెరుగుతుందని తెలియజేశారు. 2019లో కాంగ్రెస్‌కు ప్రతిపక్షహోదా కూడా దక్కదని ఆయ‌న వ్యాఖ్యానించారు. అప్పుడు కేంద్ర రాజకీయాల్లోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తామని బూర న‌ర్స‌య్య గౌడ్‌ చెప్పారు. రాష్ట్రానికో పార్టీతో జట్టు కట్టి కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీ హోదాను దక్కించుకుంటున్నదని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. ఏ రాష్ట్రంలోనూ చేయని దళిత సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్‌ చేపట్టారని న‌ర్స‌య్య తెలిపారు. 60 ఏళ్ల‌ కాంగ్రెస్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎదగనివ్వలేదన్నారు. కాంగ్రెస్‌లో ఒక్క బీసీ ఎంపీ గాని, ఎమ్మెల్యేగాని ఉన్నారా ? అని ప్రశ్నించారు. కులవృత్తులను నాశనం చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించారు. నోట్ల రద్దుపై మోడీకి తాము ఏకపక్షంగా మద్దతు ఇవ్వలేదని చెప్పారు. నగదు రహిత పాలన కోసం అలా చేశామని, దీంతో తమకు స్వప్రయోజనాలు ఏమీ లేవన్నారు. తెలంగాణలో రావుల పాలన సాగుతున్నదని అనడం ఎంతమాత్రం సరికాదని న‌ర్స‌య్య గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌ నేతల ఆవేదనను ప్రజల ఆవేదనగా చెబుతున్నారని విమర్శించారు. మొత్తంగా సీఎం పదవి విషయంలో పలు ఊహాగానాలకు తావిచ్చేలా ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/