Begin typing your search above and press return to search.

అప్పుడే ద్రౌపదికి బోనస్ ఓట్లా ?

By:  Tupaki Desk   |   2 July 2022 8:30 AM GMT
అప్పుడే ద్రౌపదికి బోనస్ ఓట్లా ?
X
రాష్ట్రపతి ఎన్నికలు ముఖాముఖి జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము పోటీచేస్తుండగా నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పోటీచేస్తున్నారు.

నామినేషన్లు దాఖలు చేసిన 120 ఇతర నామినేషన్లను తిరస్కరించిన కారణంగా పోటీ ముఖాముఖి అయిపోయింది. నిజానికి పోటీ జరుగుతున్నా ద్రౌపది గెలుపు లాంఛనమనే చెప్పాలి. ఎలాగంటే ఓట్ల విలువ ప్రకారం చూస్తే ఎన్డీయేకి మద్దతిస్తున్న పార్టీలు ఎక్కువగా ఉన్నాయి.

నాన్ ఎన్డీయే, ఎన్డీయే పార్టీల్లో బీజూ జనతాదళ్, వైసీపీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది గెలుపు ఖాయమైపోయింది. దీనికి అదనంగా యూపీఏలో భాగస్వామే అయినా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కూడా ద్రౌపదికే మద్దతు ప్రకటించారు. సరే ఈ పార్టీల మద్దతుతో ఇప్పటికే గెలుపు ఖాయమైపోయినా ఇంకా ఎన్నిక జరగకుండానే ద్రౌపదికి బోనస్ ఓట్లొచ్చేశాయనే చెప్పాలి.

బోనస్ ఓట్లేమిటంటే మహారాష్ట్ర నుండి వచ్చేశాయి. పదిరోజుల క్రితం వరకు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అధికారంలో ఉండేది. కాబట్టి మహారాష్ట్రలో యశ్వంత్ సిన్హాకే మెజారిటి ఓట్లు పడతాయని అందరు అనుకున్నారు.

ఎందుకంటే ఎంవీఏలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలున్నాయి కాబట్టే. అయితే అనూహ్యంగా రాజకీయ సంక్షోభం కారణంగా అధికారం మారిపోయింది. ఎన్సీపీ, కాంగ్రెస్ లో ఓట్లు అలాగే ఉండగా శివసేన ఓట్లుమాత్రం తల్లకిందులైపోయాయి.

శివసేనలోని 55 మంది ఎంఎల్ఏల్లో 40 మంది ఏక్ నాథ్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. దాంతో బీజేపీ+శివసేన చీలికవర్గం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అంటే బీజేపీతో పొత్తు కారణంగా 40 మంది ఎంఎల్ఏల బలం హఠాత్తుగా వచ్చి చేరింది. ఈ విషయం ఇలాగుంటుంటే 18 మంది ఎంపీల్లో 14 మంది ఏక్ నాథ్ షిండేతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. అంటే ద్రౌపదికి బోనస్ గా 40 మంది ఎంఎల్ఏలు+14 మంది ఎంపీ ఓట్లు వస్తున్నట్లే కదా.