Begin typing your search above and press return to search.

ఇచ్చే మద్ధతు ఇస్తూ ఆ మాటలేంది బొండా

By:  Tupaki Desk   |   20 July 2016 10:41 AM GMT
ఇచ్చే మద్ధతు ఇస్తూ ఆ మాటలేంది బొండా
X
ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఏపీ తెలుగు తమ్ముళ్లకు అర్థం కాదా? అనుమానం కలగక మానదు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు బిల్లు పెట్టటం.. దీనికి సంబంధించిన ఓటింగ్ శుక్రవారం జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో.. ఈ అంశం మీద ఒక్కసారి కాక మొదలైంది. ఏపీ అధికారపక్షంగా తెలుగు దేశం పార్టీకి కావాల్సిన ప్రత్యేక హోదా బాధ్యతను కాంగ్రెస్ నేత తన నెత్తి మీద వేసుకొని.. మోడీ సర్కారుకు ఇబ్బంది కలిగించేలా పావులు కదపటం తెలిసిందే.

ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మించి సంతోషపడేవారు మరొకరు ఉండరు. ఏపీ అభివృద్ధికి ఎంతో సాయం చేసే హోదాను మోడీ ఇచ్చేందుకు సముఖంగా లేని నేపథ్యంలో.. మిత్రుడిగా తమకు తాము ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో కేవీపీ రూపంలో ప్రత్యేకహోదాకు అవకాశం లభించినప్పుడు.. ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం చంద్రబాబు అండ్ కో కు ఉంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఏపీ తమ్ముళ్లు సీమాంధ్రులకు మంట పుట్టేలా వ్యవహరిస్తున్నారని చెప్పాలి.

కేవీపీ ప్రైవేటు బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని.. ఏపీ ప్రయోజనాల ముందు తమకింకేమీ అవసరం లేదన్న మాటలు చెబితే మోడీ ఏమీ మొట్టికాయలు వేయరు కదా? అయినా.. ఆచితూచి మాట్లాడటం తెలుగుదేశం నేతల్లో కనిపిస్తుంది. ప్రైవేటు బిల్లుతో ఒరిగేది ఏమీ లేకున్నా.. తాము మద్ధతు ఇస్తామని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు లాంటోళ్లు చేస్తున్న వ్యాఖ్యలు మంట పుట్టేలా ఉన్నాయని చెప్పాలి. వాస్తవానికి ఏపీ ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు.. ప్రత్యేక హోదా అంశాన్ని ఎవరు తెర మీదకు తీసుకొచ్చినా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని మార్కులు తెచ్చుకోవాల్సిన తెలివి తేటలు ప్రదర్శించాల్సింది పోయి.. అందుకు భిన్నమైన బడాయి మాటలు ఏ మాత్రం సరికాదన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో.. పలు పార్టీలు.. నేతలు మాట్లాడినా.. అంతిమంగా ఆ సెంటిమెంట్ ను పూర్తిగా క్యాష్ చేసుకున్న సత్తా కేసీఆర్ దే. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలోనూ చంద్రబాబు పరివారం అలాంటి వ్యూహాన్నే అనుసరించాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యాఖ్యలు ఏ మాత్రం సరికాదని.. ఇలాంటి వ్యాఖ్యలు సీమాంధ్రులు మనసులో పెట్టుకొని.. తమ ఆగ్రహాన్ని సమయం చూసుకొని బయటకు వెళ్లగక్కుతారన్న విషయాన్ని బొండా మర్చిపోయినట్లున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు దీర్ఘకాలంలో చేటు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి వాటికి చంద్రబాబు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.