Begin typing your search above and press return to search.

బొండాకు ధైర్యం ఎక్కువే బాస్

By:  Tupaki Desk   |   19 Aug 2016 8:52 AM GMT
బొండాకు ధైర్యం ఎక్కువే బాస్
X
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దూకుడు ఎంతలా ఉంటుందన్నది ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తే తెలుస్తుంది. ఒక రోజా కావొచ్చు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావొచ్చు.. కొడాలి నాని.. ఇలా చెప్పుకుంటూ ఒక్కొక్కరూ ఒక్కో ఫైర్ బ్రాండ్ గా కనిపిస్తారు. వీళ్ల ఆవేశానికి తగ్గట్లే ఏపీ అధికారపక్ష నేతల్లో చెలరేగిపోయే నేతలు కాస్త తక్కువే కనిపిస్తారు. జగన్ పార్టీ నేతలతో ధీటుగా చెలరేగిపోయే నేతల్లో మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు లాంటి వారు కొద్ది మందే కనిపిస్తారు. తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ.. వెనుకా ముందు చూసుకోకుండా అడ్డ బ్యాటింగ్ అన్నట్లుగా మాటలతో చెలరేగిపోవటం వీరికి అలవాటే.

ఇంతకాలం ప్రత్యర్థులపై చెలరేగిపోయే బొండా తాజాగా మిత్రపక్షంపై కూడా మాటలు పేల్చటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. తాజాగా కేంద్రం ఏపీకి నిధులు విడుదల చేసింది. రెండు వేల కోట్ల కంటే తక్కువగా ఉన్న ఈ నిధులపై పలువురు అధికారపక్ష నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో పెదవి విరిచినా అదే విషయాన్ని బయటకు చెప్పేందుకు మాత్రం పెద్దగా ఇష్టపడలేదు. అందుకు భిన్నంగా బొండా మాత్రం మాట్లాడేశారు. కేంద్రం ఏపీకి చిల్లర విదిలించి.. ఎంతో ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటుందని సూటి వ్యాఖ్యను చేశారు.

ఏపీ పట్ల కేంద్రం ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం కావటం లేదన్న ఆయన.. ఏపీ రాజధానికి రూ.45వేల కోట్లు అవసరమని.. అయితే.. కేంద్రం రూ.450 కోట్లు ఇచ్చిందని.. ఆ మొత్తం డ్రైనేజీకి కూడా సరిపోదని గుస్సా అయ్యారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీగా జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున చిల్లర విదిలిస్తే ఏం చేయాలన్న అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన.. బుందేల్ ఖండ్ కు రూ.7వేల కోట్లు.. ఒడిషాకు రూ.8వేల కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడేది లేదంటూ ఫైర్ అవుతున్న బొండా మాటలు ఆసక్తికరంగా మారాయి. కేంద్రం నుంచి అరకొర సాయం అందుతున్నా.. ఆ విషయాన్ని బయటకు చెప్పేందుకు మొహమాట పడుతున్న మిగిలిన తమ్ముళ్లతో పోలిస్తే.. బొండా మాత్రం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని చెప్పాలి. బొండా బాటలో మిగిలిన తమ్ముళ్లు కూడా నడిస్తే కేంద్రం నుంచి నిధులు రాకున్నా.. ఇమేజ్ మాత్రం బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది.