Begin typing your search above and press return to search.

బొండా మాటల్ని వింటున్నావా చంద్రబాబు?

By:  Tupaki Desk   |   19 April 2016 4:09 PM GMT
బొండా మాటల్ని వింటున్నావా చంద్రబాబు?
X
ఇష్టారాజ్యంగా మాట్లాడే నేతలకు అంతే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సమాధానం కానే కాదన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిది. ఒకవేళ వారికి అర్థం కాకుండా.. వారి అధినాయకుడిగా చంద్రబాబు అయినా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. నోటికి వచ్చినట్లుగా ఒకరు మాట్లాడారని.. అదే రీతిలో మిగిలిన వారు మాట్లాడటం సరికాదు. ఈ మధ్యన వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రోజా మాట్లాడుతూ.. టీడీపీలో మగాళ్లు లేకనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని తీసుకెళుతున్నట్లుగా వ్యాఖ్యనించారు.

రోజా విపరీత వ్యాఖ్యలు పలువురు తప్పు పట్టారు. రోజా మాటల్నే తప్పు పడితే.. ఆమెకు మించిన అన్నట్లుగా తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చిరాకు పుట్టించటమే కాదు.. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల నోటి నుంచి ఇలాంటి మాటలేంటన్న చిరాకు పుట్టక మానదు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తాజాగా రోజా వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు.

దూకుడుగా మాట్లాడే తత్వం ఉన్న బొండా ఉమా మాట్లాడుతూ.. టీడీపీలో మగవాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువగా తెలిసింది రోజాకేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మా రోజారెడ్డిగారూ.. మీరు కూడా టీడీపీలో పని చేశారు. పదేళ్లు మాతో ఉన్నారు. ఎంతమంది మగాళ్లు ఉన్నారో మీకు తెలుసు. ఎంతమంది మగాళ్లను చూశారో మీకు తెలుసు. టీడీపీలో మగాళ్లు ఉన్నారో లేదో అన్నది అందరి కంటే ఎక్కువ తెలిసిన వారు మీరే’’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు సరికావన్న వాదన పలువురి నోట వినిపిస్తోంది.