Begin typing your search above and press return to search.

ఎంపీ అరవింద్ మెడకు గుదిబండలా మారిన బాండ్

By:  Tupaki Desk   |   17 Dec 2019 4:44 AM GMT
ఎంపీ అరవింద్ మెడకు గుదిబండలా మారిన బాండ్
X
ఎన్నికల వేళ వీరావేశంతో హామీలు ఇచ్చే తీరుకు కాలం చెల్లి చాలాకాలమే అయ్యింది. ఇప్పుడు దాని స్థానే సరికొత్తగా చేసిన ప్రచారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ను గెలిచేలా చేసిందన్నది మర్చిపోకూడదు. బరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ సిట్టింగ్ ఎంపీ కవితకు ఎదురొడ్డి మరీ విజయం సాధించటం అంత తేలికైన విషయం కాదు. అరవింద్ గెలిచారంటే.. అది ఆయన చేసిన వినూత్న ప్రచారంతో పాటు.. నమ్మకంగా చెప్పిన మాట అన్నది మర్చిపోకూడదు.

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు.. ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పిస్తానంటూ అరవింద్ ప్రచారం చేయటమే కాదు.. రైతులకు స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిన హామీ పత్రం కూడా ఆయన్ను ఎంపీగా గెలిపించిందన్నది మర్చిపోకూడదు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత తానిచ్చిన హామీల్ని అమలు చేయని పక్షంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయనిచ్చిన హామీ ఇప్పుడాయనకు గుదిబండలా మారింది.

రెండు హామీల్ని నేరవేర్చకుంటే పదవికి రాజీనామా చేస్తానన్న ఆయన.. ఇప్పుడా పని ఎందుకు చేయటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టి ఆర్నెల్లు దాటిందని.. మరి.. ఎన్నికల వేళలో ఇచ్చిన హామీకి తగ్గట్లు అరవింద్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ రైతుల్లో అంతకంతకూ పెరుగుతూ ఉంది. ఇప్పుడు నిరసనలు పెరుగుతున్నాయి.

ఎన్నికల వేళ ఏ హామీ పత్రమైతే తిరుగులేని రీతిలో విజయాన్ని అందించిందో.. ఇప్పుడు అదే హామీ పత్రం ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు.. ఎంపీ గారిని ఊపిరి తీసుకోలేని రీతిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు చెబుతున్నారు. మరీ.. ఎంపీ ఇచ్చిన హామీని పార్టీ అధిష్టానం అమలు చేస్తుందా? అన్న దానిపైనే అరవింద్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు.