Begin typing your search above and press return to search.

మంత్రి కొడాలి నాని ఇంట్లో బాంబ్ స్క్వాడ్ సోదాలు...

By:  Tupaki Desk   |   4 Dec 2020 2:05 PM IST
మంత్రి కొడాలి నాని ఇంట్లో బాంబ్ స్క్వాడ్ సోదాలు...
X
ఏపీ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కొడాలి నానికి పోలీసులు భద్రత పెంచారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుడివాడ రాజేంద్రనగర్‌ నివాసంలో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు. మచిలీపట్నం నుంచి వచ్చిన యాంటీ బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది స్నిప్పర్‌ డాగ్‌ సాయంతో ఇంటి ఆవరణ, పరిసరాలను పరిశీలించారు. మంత్రి కొడాలి నాని ప్రయాణించే వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. మెటల్ డిక్టర్, డిజిటల్ స్కానర్ల ఏర్పాటు చేసి మంత్రి కొడాలి నాని నివాసంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మంత్రి నాని నివాసానికి వచ్చే వారిని మెటల్‌ డిటెక్టర్‌, స్కానర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి వెళ్లడానికి అనుమతి ఇస్తున్నారు. ఇటీవల ఏపీ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. పేర్ని నాని తల్లి దశ దిన కర్మ రోజు మంత్రి ఇంటికి వెళ్లిన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి.. మంత్రి కాళ్ల మీద పడుతున్నట్లు నటించి.. తన వెంట తీసుకెళ్లిన తాపీ బయటకు తీసి మంత్రిపై దాడికి ప్రయత్నించాడు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిందితుడ్ని పట్టుకున్నారు. అనంతరం తాపీ మేస్త్రి నాగేశ్వరరావును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంత్రి కొడాలి నాని నివాసంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐతే నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి అని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.