Begin typing your search above and press return to search.

సీమలో నాటుబాంబుల కలకలం.. బాలుడి మృతి.. మాజీ ఎమ్మెల్యే స్వగ్రామంలో ఘటన

By:  Tupaki Desk   |   16 Nov 2020 6:00 PM IST
సీమలో నాటుబాంబుల కలకలం..  బాలుడి మృతి..  మాజీ ఎమ్మెల్యే స్వగ్రామంలో ఘటన
X
రాయలసీమ ఫాక్షన్​ పడగవిప్పిందా.. నివురుగప్పిన నిప్పులా ఉన్న గ్రూప్ తగాదాలు మళ్లీ రాజుకున్నాయా..! అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఆదివారం కడప జిల్లా జమ్మలమడుగులో ఓ రాజకీయ హత్య కలకలం సృష్టించింది. అదే రోజు కర్నూల్​ జిల్లా అవుకు మండలం చెన్నంపల్లి గ్రామంలో నాటుబాంబు పేలి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సదరు బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనతో చెన్నంపల్లి ఉలిక్కిపడింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చెన్నంపల్లి మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్ధసారధి రెడ్డి స్వగ్రామం కావడం గమనార్హం.

ఇంతకీ ఏం జరిగిందంటే..!

కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో స్కూల్ పక్కన గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు దాచిపెట్టారు. అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి కుమార్ ఆడుకొనేందుకు పాఠశాలవైపు వెళ్లాడు. అయితే అక్కడ నాటుబాంబులు కనిపించడంతో వాటిని బంతులుగా భావించి ఆడుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా నాటుబాంబు పేలింది. కుమార్‌కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాలుడ్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ పక్కన నాటుబాంబులు ఎవరు పెట్టారు.. ఎందుకోసం ఉంచారు.. ఎక్కడ తయారు చేశారు.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.