Begin typing your search above and press return to search.

గుర్మీత్ తో ఆ స్టార్స్ కు స‌న్నిహిత సంబంధాలు

By:  Tupaki Desk   |   5 Sep 2017 10:39 AM GMT
గుర్మీత్ తో ఆ స్టార్స్ కు స‌న్నిహిత సంబంధాలు
X
ఇద్ద‌రు స్వాధీల‌ను అత్యాచారం చేసిన ఉదంతంలో దోషిగా తేలి 20 ఏళ్ల జైలుశిక్ష అనుభ‌విస్తున్నారు డేరా బాబా రామ్ ర‌హీం గుర్మీత్‌. జైలుశిక్ష నేప‌థ్యంలో ఇండియ‌న్ ఫిలిం అండ్ టెలివిజ‌న్ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్.. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్లు బాబా స‌భ్య‌త్వాల్ని ర‌ద్దు చేశాయి. బాబాతో పాటు.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటుంద‌ని చెప్పే హ‌నీప్రీత్ స‌భ్య‌త్వాన్ని కూడా ర‌ద్దు చేశారు.

అత్యాచార కేసు తీర్పున‌కు ముందు వ‌ర‌కు బాలీవుడ్ తో పాటు.. రాజకీయ రంగంపైనా గుర్మీత్ ప‌ట్టు చాలానే ఉంద‌ని చెప్పాలి. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. సాధార‌ణంగా ఏదైనా సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే సోష‌ల్ మీడియాలో రియాక్ట్ అయ్యే బాలీవుడ్ సెల‌బ్రిటీలు ప‌లువురు త‌మ తీరుకు భిన్నంగా ఈసారి కామ్ గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. గుర్మీత్ కు బాలీవుడ్ తో ఉన్న సంబంధాలు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ప‌లువురు హీరోలు.. హీరోయిన్ల‌తో ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. జైలుశిక్ష ప‌డిన త‌ర్వాత కూడా సినీ న‌టి రాఖీసావంత్ మాట్లాడుతూ.. గ‌ణేశ్ మ‌హ‌రాజ్ కానీ గుర్మీత్‌ కు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే త‌న‌కో సినిమా ఛాన్స్ ద‌క్కుతుంద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలో ఓ సినిమా స‌క్సెస్ పార్టీకి హాజ‌రైన గుర్మీత్ బాబా ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఆయ‌న‌తో సెల్ఫీ దిగేందుకు రాఖీ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాద‌ని చెబుతున్నారు. ఆ మాట‌కువ‌స్తే డేరా బాబాతో సెల్ఫీలు దిగిన బాలీవుడ్ స్టార్ల చిట్టా చాలా పెద్ద‌దే. హృతిక్ రోష‌న్‌.. శిల్పాశెట్టి.. అనిల్ క‌పూర్‌.. జాన్ అబ్ర‌హం.. శేఖ‌ర్ సుమ‌న్‌.. జాన్ అబ్ర‌హం లాంటి స్టార్లు చాలామందే ఉన్నారు. జైలుశిక్ష అనంత‌రం గుర్మీత్ తో ప‌లువురు సెల‌బ్రిటీలు దిగిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్స్‌ కు బాబాతో ఉన్న స‌న్నిహిత సంబంధాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే.. జైలుశిక్ష అనుభ‌విస్తున్న డేరా బాబా నిత్యం త‌నకు అత్యంత స‌న్నిహితురాలైన హ‌నీప్రీత్ గురించి ప‌దే ప‌దే త‌లుచుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. త‌న భార్య‌ను క‌లుసుకోవ‌టానికి ఏ మాత్రం ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌ని డేరా బాబా.. త‌న ద‌త్త కుమార్తెగా చెప్పుకునే హ‌నీప్రీత్‌ ను మాత్రం విప‌రీతంగా త‌లుచుకుంటున్నార‌ట‌. అదే టైంలో హ‌నీప్రీత్ తో పాటు.. త‌న త‌ల్లి న‌సీబ్ కౌర్‌.. కుమారుడు జ‌స్మీత్‌.. కుమార్తెలు చ‌ర‌ణ్ ప్రీత్‌.. అమ‌ర్ ప్రీత్‌.. అల్లుల్లు.. డేరా ఛైర్మ‌న్ల‌తో పాటు అనుచ‌రుడు దాన్ సింగ్ ల‌నుకూడా క‌లుసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇక‌.. హ‌నీప్రీత్‌ ను ప‌దే ప‌దే త‌లుచుకుంటూ విల‌పిస్తున్నాడ‌ట‌.

జైలుశిక్ష అనుభ‌విస్తున్న డేరాబాబాకు సంబందించి మ‌రో ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు బోస్ అంటే అత‌నికి మ‌హా ఇష్ట‌మ‌ట‌. అందుకే.. నేతాజీ పై సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడ‌ట‌. బోస్ మీద సినిమాతో బెంగాల్ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం కావ‌టంతో పాటు.. వారిపై త‌న‌దైన ముద్ర వేయాల‌ని అనుకున్నాడ‌ట‌. ఈ సినిమాలో భాగంగా నేతాజీ జీవితానికి సంబంధించి ప‌లు అంశాలతో పాటు ఆయ‌న మ‌ర‌ణం వెనకున్న మిస్ట‌రీని ట‌చ్ చేయ‌టం ద్వారా త‌న సినిమాను హాట్ హాట్ గా మార్చాల‌ని భావించాడ‌ట‌. సెన్సార్ చిక్కులు ఎదురైతే త‌న‌కున్న ప‌లుకుబ‌డితో స‌ర్దుబాటు చేయాల‌ని కూడా అనుకున్నాడ‌ట‌. ఈ చిత్రం కోసం రూ.5కోట్ల‌ బ‌డ్జెట్‌ ను సిద్ధం చేశాడ‌ని.. ఈ సినిమాతో త‌క్కువ‌లో త‌క్కువ రూ.50 కోట్ల వ‌ర‌కూ ఆదాయం వ‌స్తుంద‌ని భావించిన‌ట్లుగా తెలుస్తోంది. ఊహించ‌ని రీతిలో జ‌రిగిన ప‌రిణామాల‌తో బోస్ సినిమా వెన‌క్కి వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.