Begin typing your search above and press return to search.

మరీ.. అంత అత్యాశేంటి బొజ్జల

By:  Tupaki Desk   |   10 May 2016 4:55 AM GMT
మరీ.. అంత అత్యాశేంటి బొజ్జల
X
ఆశను ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ.. అత్యాశను ఎవరూ ఒప్పుకోరు. తాజాగా ఏపీ అధికారపక్షం తీరు ఆశ స్థాయి దాటి అత్యాశలోకి వెళ్లటం కనిపిస్తుంది. ఆపరేషన్ ఆకర్ష్ తో ఏపీలో తమ పార్టీ తిరుగులేనిదిగా తయారు చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఏపీలో విపక్షమే లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యంగా చెప్పుకునే మంత్రి బొజ్జల లాంటోళ్ల మాటలు వింటే విస్మయం చెందకమానదు.

పాతతరం నేత అయి ఉండి కూడా.. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం పాత్ర ఎంత కీలకమో.. విపక్షం పాత్ర అంతే కీలకమన్న విషయాన్ని బొజ్జల మర్చిపోవటం ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కాదు. ఏపీలో విపక్షం అన్నది లేకుండా చేస్తామంటూ ఆయన చేస్తున్న మాటలు ఏపీ అధికారపక్ష అత్యాశను చెప్పకనే చెప్పేస్తున్నాయని చెప్పాలి. విపక్షాన్ని దెబ్బ తీయటానికి ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఈ పేరిట విపక్షమే ఉండకూడదన్నట్లుగా వ్యవహరించటం అభ్యంతరకరం.

నిజానికి ఇదే విధానాన్ని గత పాలకులు అనుసరించి ఉంటే.. ఈ రోజు అధికారపక్షంగా ఉండేవారా? ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయటమే తమ లక్ష్యమని బొజ్జల చేసిన ప్రకటన ఏపీ ప్రజల్నిచికాకు పెట్టటమే కాదు.. అధికార తెలుగుదేశం పార్టీ అత్యాశను చెప్పకనే చెప్పేసినట్లు అవుతుంది. తన మంత్రివర్గానికి చెందిన మంత్రి ఒకరు ఆచితూచి మాట్లాడాల్సింది పోయి.. ప్రభుత్వం మీద మండిపాటు కలిగేలా వ్యాఖ్యలు చేయటం అభ్యంతరకరం. ఇలాంటి నేతల మాటల జోరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటివాళ్లు బ్రేకులు వేయాలి. లేనిపక్షంలో.. మంత్రుల అత్యాశ ప్రకటనలు ఏపీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా చేస్తుందన్నది మర్చిపోకూడదు.