Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష రేసు నుంచి ‘భారతీయుడు’ ఔట్

By:  Tupaki Desk   |   18 Nov 2015 6:33 AM GMT
అమెరికా అధ్యక్ష రేసు నుంచి ‘భారతీయుడు’ ఔట్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ ఎపిసోడ్ ముగిసింది. లూసియానా గవర్నర్ గా వ్యవహరిస్తున్న బాబీ జిందాల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ల తరఫున బరిలో నిలవాలని తహతహలాడారు. ఇందుకు తగినట్లుగా ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ అభ్యర్థిగా అవతరించటానికి ముందు జరిగే ప్రాసెస్ తనకు సానుకూలంగా లేకపోవటం.. నిధుల సమీకరణ మొదలు.. తనకు స్పందన పేలవంగా ఉండటంతో తాను ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ చేయటానికి తాను విరమించుకున్నట్లుగా వెల్లడించిన ఆయన.. మరొకరిని బలపరిచే అవకాశం లేదన్నారు. అయితే.. పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నియమిస్తుందో... వారికి తన పూర్తి మద్దుతు ప్రకటించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఆయన చేస్తున్న ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేశారు.

ఇప్పటివరకూ అధ్యక్ష ఎన్నికల కోసం తాను ఎంతో కసరత్తు చేశానని.. ఇప్పుడు మాత్రం మరో అంశం మీద దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్న ఆయన నిష్క్రమణతో రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారి సంఖ్య 14కు తగ్గింది. రానున్న రోజుల్లో బాబీ జిందాల్ మాదిరి నిర్ణయం తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. అధ్యక్ష బరి నుంచి బాబీ జిందాల్ తప్పుకోవటానికి పేలవమైన స్పందన రావటం.. ఆశించినంతగా నిధులు రాకపోవటం కూడా ఆయన పోటీ నుంచి బయటకు రావటానికి కారణాలుగా చెబుతున్నారు. బాబీ జిందాల్ తాజా నిర్ణయంతో.. సమీప భవిష్యత్తులో భారతీయ మూలాలున్న అభ్యర్థి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దేగే అవకాశాలు లేనట్లేనని చెప్పొచ్చు.