Begin typing your search above and press return to search.

ఉద్యోగ సంఘాల నేతల కోసం నిరుద్యోగులకు దెబ్బేశారా?

By:  Tupaki Desk   |   9 Jan 2022 7:30 AM GMT
ఉద్యోగ సంఘాల నేతల కోసం నిరుద్యోగులకు దెబ్బేశారా?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు వరాలు ఇవ్వాలంటే పాలకులకువణుకు పుట్టే పరిస్థితి. మధ్యతరగతి కుటుంబరావుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఏపీ ఆర్థిక పరిస్థితి నెలకొంది. కొండంత అప్పుకు.. నెల తిరిగేసరికి వచ్చి పడే ఖర్చులు.. ఇవి సరిపోవన్నట్లుగా పెద్ద ఎత్తున చేపడుతున్న సంక్షేమ పథకాలతో.. ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఇలాంటివేళలో.. ఉద్యోగుల డిమాండ్లకు తగ్గట్లు పీఆర్సీ ఇవ్వటం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ.. అంకెల మాయాజాలంతో పీఆర్సీ లెక్క తేల్చేశారు సీఎం జగన్. దీనిపై పలువురు ఉద్యోగులు వేలెత్తి చూపిస్తున్నా.. పట్టించుకోవటం లేదు.

ఇదిలా ఉంటే.. పీఆర్సీ ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి వచ్చిన రిటైర్మెంట్ పొడిగింపు గడువు మీద మాత్రం నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లక్షలాది మంది యువకుల భవిష్యత్తును ముఖ్యమంత్రి దెబ్బ తీశారని చెబుతున్నారు. లక్షల్లో ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు ఇవ్వకున్నా... కాస్త తక్కువగా అయినా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని అందరూ భావించారు. అందుకు భిన్నంగా రెండేళ్లు పదవీ విరమణ వయసును పొడిగించటంతో.. మరో రెండేళ్ల వరకు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ కారు.

అంటే.. ఇప్పుడున్న ఖాళీలు అలా ఉంటాయి. కొత్త ఖాళీలు వచ్చే అవకాశం ఉండదు. దీనికి తోడు.. ఉద్యోగులురిటైర్ అయి.. వారి స్థానే కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటే.. వారికి ఇచ్చే జీతం బిల్లు కూడా తక్కువే అవుతుంది. ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా.. రిటైర్ కావాల్సిన వారిని మరో రెండేళ్లు కొనసాగించటం ద్వారా.. వారి జీతం బిల్లులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉద్యోగ సంఘాల నేతల్ని ప్రసన్నం చేసుకోవటం కోసం.. తాము ఇచ్చిన పీఆర్సీకి ఆహా.. ఓహో అనేలా కీర్తించేందుకు వీలుగా రిటైర్మెంట్ పొడిగింపు పై ప్రభుత్వ నిర్ణయం ఉందంటున్నారు.

ఎందుకంటే.. ఉద్యోగ సంఘాల నేతలైన బండి శ్రీనివాసరావు మార్చిలో రిటైర్ కావాల్సి ఉందంటున్నారు. అదే సమయంలో మరో ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు జులైలో రిటైర్ కావాలంటున్నారు. వీరిద్దరే కాదు.. ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు పలువురు.. ఈ ఆర్నెల్లలో రిటైర్ కావాల్సి ఉందని.. .ఇలాంటివేళ.. వారి ఉద్యోగాల పదవీ విరమణను రెండేళ్ల పాటు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం కొందరికి పండగలా మారితే.. వేలాది మందికి దండగ చేసిందని చెబుతున్నారు. గుప్పెడు మంది ఉద్యోగ సంఘాల నేతలకు.. యువకుల భవిష్యత్తును దెబ్బ తీస్తారా?అన్నది ప్రశ్నగా మారింది.