Begin typing your search above and press return to search.

వాల్ స్ట్రీట్ చరిత్రలో.. ఇలాంటి సీన్ చాలా అరుదట

By:  Tupaki Desk   |   17 March 2020 6:30 AM GMT
వాల్ స్ట్రీట్ చరిత్రలో.. ఇలాంటి సీన్ చాలా అరుదట
X
కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచంలోని ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా అన్ని దేశాలు తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోతున్నాయి. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలోనూ ఇబ్బందికర పరిస్థితి మొదలైంది. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న అమెరికా.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కోంటోంది. చాలా దేశాల్లో మాదిరి అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. ఎంతలా అంటే.. వాల్ స్ట్రీట్ చరిత్ర లో చాలా రేర్ గా చోటు చేసుకునే సీన్ తాజాగా రిపీట్ కావటమే నిదర్శనంగా చెప్పాలి.

గడిచిన కొద్ది రోజులుగా కరోనా కారణంగా వాల్ స్ట్రీట్ లో సెంటిమెంట్ దెబ్బ తిని అమ్మకాల ఒత్తిడి పెరిగిపోవటం తో.. సూచీ తిరోగమనంలోకి పయనించటమే కాదు.. ట్రేడింగ్ నిలిపివేసే అరుదైన పరిస్థితి చోటు చేసుకుంది. తాజాగా సోమవారం ట్రేడింగ్ ఆరంభమైన కాసేపటికే వాల్ స్ట్రీట్ భారీ నష్టాల్ని మూటగట్టుకోవటం తో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మార్కెట్ లో ట్రేడింగ్ ను పదిహేను నిమిషాల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితి గడిచిన వారంలో ఇది మూడోసారి కావటం గమనార్హం.

వాల్ స్ట్రీట్ చరిత్రలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం చాలా అరుదుగా అభివర్ణిస్తున్నారు. మార్కెట్ లో ట్రేడింగ్ మొదలైన కాసేపటికే ఎస్ అండ్ పీ 500 షేర్లు ఎనిమిది శాతం నష్టాల్లో జారుకుంది. ఎస్ అండ్ పీ ఎనిమిది శాతం.. డౌజోన్స్ 9.7 శాతం నష్టపోవటం తో ట్రేడింగ్ ను నిలిపివేశారు. కాసేపటి తర్వాత ట్రేడింగ్ మళ్లీ మొదలు పెట్టినా.. నష్టాలు మాత్రం ఆగలేదు. భారత్ లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. మొన్ననే.. ట్రేడింగ్ భారీ నష్టాల దిశగా వెళుతున్న వేళ.. కట్టడి చేసేందుకు కాసేపు నిలిపివేసి.. మళ్లీ మొదలుపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా చరిత్రలో చాలా అరుదుగా చోటు చేసుకునే ఉదంతాలు ఇప్పుడు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.