Begin typing your search above and press return to search.

మసూద్ ను వాడేస్తోన్న బీజేపీ

By:  Tupaki Desk   |   2 May 2019 3:37 PM IST
మసూద్ ను వాడేస్తోన్న బీజేపీ
X
అనుకున్నట్టే అయ్యింది. మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. బీజేపీలో కరుడుగట్టిన కఠిన వాస్తవాలు చెప్పే కేంద్రమంత్రిగా అరుణ్ జైట్లీకి పేరుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం అనే కఠిన వాస్తవాన్ని కూడా ఈయన చేతే బీజేపీ అధిష్టానం చెప్పించింది. అది పాజిటివ్ అయినా.. నెగెటివ్ అయినా అరుణ్ జైట్లీతోనే చెప్పిస్తున్నారు.

తాజాగా మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని అరుణ్ జైట్లీ తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారును ప్రశంసించాలని ప్రతిపక్షాలను కోరడం విశేషం. మోడీ అవిశ్రాంత కృషి, ఉగ్రవాదంపై రాజీలేని పోరుతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ లో భారత వైమానిక దాడులతోనే చైనా వైఖరి మారిందని.. అందుకే అజార్ ను ఉగ్రవాదిగా ప్రకటించిందని తెలిపారు.

ఇక మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు , ప్రజలు ఇది దేశం విజయంగా గుర్తించి సంబరాలు చేసుకోవాలని అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ఇది భారతీయులు గర్వించదగ్గ పరిణామం అని అన్నారు. రాజకీయంగా బీజేపీకి లాభం చేకూరుతుందనే ప్రతిపక్షాలు దీన్ని అంగీకరించడానికి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఇలా మసూద్ అజార్ వ్యవహారాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. పైగా విపక్షాలన్నీ బీజేపీని ప్రశంసించాలట.. ఇలా ప్రతి విజయాన్ని తమ విజయంగా చెప్పుకొని లబ్ధి పొందాలన్న ఎత్తుగడను బీజేపీ వేసింది. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలాంటి కౌంటర్ ఇస్తాయో వేచిచూడాలి.