Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ కోసం క‌మ‌ల‌నాథుల ఆరాటం ఎంతంటే..

By:  Tupaki Desk   |   22 May 2017 1:53 PM IST
ర‌జ‌నీ కోసం క‌మ‌ల‌నాథుల ఆరాటం ఎంతంటే..
X
ప‌వ‌ర్ చేతిలో ఉంటే ఆ తీరే వేరుగా ఉంటుంది. అధికారం తీసుకొచ్చే అహంకారంతో వాస్త‌వాల్ని మ‌ర్చిపోవ‌టం రాజ‌కీయాల్లో చాలా మామూలు. ప‌వ‌ర్ ఫుణ్య‌మా అని చేసే త‌ప్పుల‌కు ఆయా రాజ‌కీయ పార్టీలు చెల్లించే మూల్యం సైతం భారీగా ఉంటుంది. అయితే.. అలాంటివాటికి మిన‌హాయింపుగా చెప్పాలి బీజేపీని. కేంద్రంలో తిరుగులేని అధికారాన్నిసొంతం చేసుకోవ‌ట‌మే కాదు.. స‌మీప భ‌విష్య‌త్తులో ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేని రీతిలో బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ.. అంత‌కంత‌కూ విస్త‌రించాల‌ని.. మ‌రిన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాల‌న్న త‌ప‌న క‌మ‌ల‌నాథుల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ప‌ట్టు చిక్కిన‌ప్పుడు అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌ద‌న్న వైఖ‌రి వారిలో క‌నిపిస్తోంది. ఉత్త‌రాది.. ఈశాన్యంలో క‌మ‌ల‌వికాసం చేయ‌గ‌లిగిన‌ప్ప‌టికీ కీల‌క‌మైన ద‌క్షిణాదిలో ప‌ట్టు చిక్క‌ని తీరు బీజేపీలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. అందుకే.. ఏది ఏమైనా.. ఏ చిన్న అవ‌కాశం ల‌భించినా ద‌క్షిణాదిలో పాగా వేయాల‌ని త‌పిస్తున్నారు క‌మ‌ల‌నాథులు. అనుకోని రీతిలో అమ్మ మ‌ర‌ణం.. ఆపై ప‌వ‌ర్ పై చిన్న‌మ్మ ఆశ.. బీజేపీ అధినాయ‌కత్వంలో కొత్త ఆశ‌లు క‌లిగేలా చేసింది. ఇందుకోసం తెర వెనుక మంత్రాంగం న‌డిపిన‌ప్ప‌టికీ పెద్ద‌గా వ‌ర్క్ వుట్ కాని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ శూన్య‌త నేప‌థ్యంలో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఉన్న‌ట్లుగా వార్త‌లు రావ‌టం.. వాటికి బ‌లం చేకూరేలా ఆయ‌న మాట‌లు ఉండ‌టంతో త‌మిళ రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డిన‌ట్లైంది. పాల‌క‌ప‌క్షంలో నెల‌కొన్న లుక‌లుక‌లు ఓప‌క్క‌.. మ‌రోవైపు బ‌ల‌హీన‌మైన విప‌క్షం వెర‌సి.. స‌రైన వ్య‌క్తి కానీ బ‌రిలోకి దిగితే ప‌వ‌ర్ వారికి సొంత‌మ‌న్న‌ట్లుగా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. విప‌రీత‌మైన ప్ర‌జాభిమానం ఉన్న ర‌జ‌నీకాంత్ లాంటి వాడైతే చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది రాజ‌కీయ పండితుల మాట‌.

ఇలాంటి వేళ‌లోనే త‌న రాజ‌కీయ అరంగేట్రం గురించి విప‌రీత‌మైన మ‌థ‌నం చేస్తున్న ర‌జ‌నీని టెంప్ట్ చేసేలా.. బీజేపీలోకి సాద‌రంగా ఆహ్వానిస్తున్నారు క‌మ‌ల‌నాథులు. జాతీయ‌పార్టీలో చేర‌కుండా.. సొంతంగా ప్రాంతీయ‌పార్టీ పెట్టుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ర‌జ‌నీ ఉన్నట్లుగా బ‌ల‌మైన క‌థ‌నాలు వినిపిస్తున్నా.. బీజేపీ నేత‌లు మాత్రం త‌మ ప్ర‌య‌త్నాల్ని అస్స‌లు ఆప‌క‌పోవ‌టం విశేషంగా చెప్పాలి. ప‌వ‌ర్‌లో ఉన్న‌ప్పుడు రాజ‌కీయాల్లో కొత్త‌గా వ‌ద్దామ‌నుకునే వారిని త‌మ పార్టీలోకి రావాలంటూ ఈ స్థాయిలో అడ‌గ‌టం ఎక్క‌డా క‌నిపించ‌దు. క‌మ‌ల‌నాథుల తీరు చూస్తుంటే.. ద‌క్షిణాదిన పాగా వేయాల‌న్న త‌ప‌న‌తో ర‌జ‌నీ రూపంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని ఏ మాత్రం వ‌దులుకోకూడ‌ద‌న్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేందుకు ప‌వ‌ర్‌లో ఉన్న పార్టీ ప‌డుతున్న త‌ప‌న స‌రికొత్తగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.