Begin typing your search above and press return to search.

రాహుల్ ది ఆవేదనే.. పట్టించుకునేదెవరు?

By:  Tupaki Desk   |   13 July 2019 11:29 AM IST
రాహుల్ ది ఆవేదనే.. పట్టించుకునేదెవరు?
X
భారతీయ జనతా పార్టీ ధనబలంతో తమ ప్రభుత్వాలను కూలదోస్తోందని ఆరోపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఎంపీ హోదాలో మాత్రమే మిగిలిన రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ రాజకీయాలను తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. వ్యతిరేక ప్రభుత్వాలను కూలదోచేయడానికి భారతీయ జనతా పార్టీ ధనబలాన్ని ఉపయోగిస్తోందని రాహుల్ ఆరోపిస్తున్నాడు. ప్రధానంగా కర్ణాటకలోని రాజకీయ పరిణామాలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారు.

ఇక గోవాలో కూడా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయిస్తోంది బీజేపీ. అక్కడ స్వల్పమైన మెజారిటీతో సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు పూర్తిగా తెగించేసింది. సంకీర్ణ సర్కారు అవసరం లేకుండా భారతీయ జనతా పార్టీ వాళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. వారికే మంత్రి పదవులను సైతం ఇచ్చేశారు. ఇలా తమ ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముగ్గురికి మంత్రి పదవులు సైతం ఇచ్చేశారు. తమకు మద్దతుగా నిలిచిన పార్టీని కూడా వద్దనుకుని అలాంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటోంది కమలం పార్టీ. ఇవన్నీ ప్రజాస్వామ్య బద్ధమైన రాజకీయాలు ఏమీ కావు.

వీటి పట్లే రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అయితే గతంలో తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ ఇలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను శాసించిన వైనాన్ని కొంతమంది గుర్తు చేస్తూ ఉన్నారు. దీంతో రాహుల్ గాంధీ ఆవేదన పై కొందరు వ్యంగ్యంగా స్పందించడానికి కూడా అవకాశం ఏర్పడుతోంది.