Begin typing your search above and press return to search.

తెలంగాణలో సక్సెస్.. త్వరలోనే ఏపీకి కొత్త సారథి

By:  Tupaki Desk   |   12 March 2020 11:16 AM IST
తెలంగాణలో సక్సెస్.. త్వరలోనే ఏపీకి కొత్త సారథి
X
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి నామమాత్రంగా ఉంది. అకస్మాత్తుగా తమతో జనసేన పార్టీ దోస్తీ చేయడంతో బీజేపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. పుంజుకునేందుకు అవకాశం ఉన్నా మాత్రం తీవ్ర తప్పిదాలతో మొదటి నుంచి రాజకీయంగా తీవ్ర నష్టపోతుంది. ఇప్పుడు జనసేనతో కలవడంతో పార్టీకి పెద్దగా లాభించేదేమీ లేదు. ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప. దీని ప్రభావం ప్రస్తుత స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా తెలిసే అవకాశం ఉంది. అయితే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీ బలోపేతానికి అంతగా పని చేయడం లేదు. గతంలో ఉన్న వారి మాదిరి ఆయన మూస పద్ధతిలో వెళ్తున్నారు. ఈ సమయంలో పార్టీ బలోపేతం కాకపోగా అభాసుపాలవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు వేరే వ్యక్తికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పక్క రాష్ట్రం తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడిగా యువ నాయకుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను నియమించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా అధ్యక్షుడి మార్పు ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో బీజేపీకి అపార అవకాశం ఉంది. నాయకులు బలంగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి పార్టీలో బలీయమైన నాయకులు లేకపోగా పార్టీకి క్యాడర్ కూడా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పొత్తు పొట్టుకోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో పార్టీ దిద్దిబాటు చర్యలు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ కు కొత్త అధ్యక్షుడిని తీసుకొచ్చే యోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను తప్పించి ఎవర్నీ నియమిస్తారనేది చర్చ సాగుతోంది. అయితే పార్టీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మారిస్తే మంచిది కాదనే అభిప్రాయం ఉంది.

నెల రోజుల తర్వాత పార్టీ అధ్యక్షుడి మార్పు తప్పనిసరిగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈసారి సామాజిక లెక్కలు వేసుకుని మరి అధ్యక్షుడిని నియమిస్తారని సమాచారం. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు ప్రధాన సామాజికవర్గం రెడ్డి, కమ్మకు చెందినవే. ఈ నేపథ్యం లో జనాభా లో సగభాగం ఉండే బీసీలను తమ వైపునకు లాగేసుకునేలా బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా కొనసాగుతుండడంతో ఈసారి వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారంట. అగ్రవర్ణాల పార్టీగా ముద్ర పడిన బీజేపీ ఆ ముద్రను చెరిపేసుకునేందుకు ఈసారి అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తెలంగాణలో బండి సంజయ్ కు ఇచ్చి ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసేలా నిర్ణయం ఉండడంతో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి వ్యక్తికి పగ్గాలు ఇచ్చే అవకాశం ఉంది. ఏమైనా స్థానిక ఎన్నికలు పూర్తయిన అనంతరం ఏప్రిల్ లో కొత్త కమల సారథి వచ్చేట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి.