Begin typing your search above and press return to search.

పార్టీ కార్యాలయాలలో....కళకళలు

By:  Tupaki Desk   |   26 Sept 2018 7:44 PM IST
పార్టీ కార్యాలయాలలో....కళకళలు
X
ముందస్తు ఎన్నిక‌ల‌ తేదీ ఖరారు కానప్పటికీ తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీ కార్యాలయాలకు అభ్యర్థుల తాకిడితో కొత్త కళ వచ్చింది. శాసనసభ ఎన్నికల బరిలో దిగేందుకు తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థులు టిక్కెట్ల కోసం దరఖాస్తులు పార్టీ ముఖ్యనేతలకు అందజేసారు. మంగళవారం నాడు భారతీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ కు - ఎన్నికల కమిటీ సీనియర్ నేత అయిన ఇంద్రసేనా రెడ్డికి తమ దరఖాస్తులు సమర్పించుకున్నారు. దీంతో మంగళవారం నాడు హైదరాబాద్‌ నాంపల్లిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం పార్టీకి చెందిన పలువురు నేతలతో కిటకిటలాడింది.

2014లో భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశంతో కలసి పోటీ చేసింది. కానీ ఈ సారి ఆ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు నిర్ణయించుకుంది. ఈ మేర‌కు తాము మొత్తం 119 నియోజకవర్గాలలోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే జిల్లాలో టిక్కెట్టు ఖాయమన్న ధీమాతో కొంతమంది అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే కొన్ని నియోజకవర్గాలలో టిక్కెట్ల కోసం గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టేషన్‌ ఘన్‌ పూర్ - ముధోల్ - మానకొండూరు వంటి నియోజకవర్గాలలో టిక్కెట్ల కోసం దాదాపుగా పదికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ కాస్త ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సారి అభ్యర్థుల ఎంపిక కోసం...శాసనసభ నియోజకవర్గాల వారీగా అభిప్రాయాలను సేకరించాలని అనుకుంటున్నట్లు సమాచారం.

వచ్చే నెల మొదటివారంలో జిల్లాలోని సీనియర్ నేతలతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీన ఖమ్మం - 4వ తేదీన అదిలాబాద్ - నిజామాబాద్ - కరీంనగర్ - మెదక్ - 5వ తేదీన రంగారెడ్డి - మహ‌బూబ్‌ నగర్ - హైద‌రాబాద్ నేతలతో సమావేశాలు జరపడానికి నిర్ణయించారు. మంగళవారం నాడు పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ - తెరాసతో జత కట్టినా ఆశ్చర్యపోన‌క్క‌ర్లేదని అన్నారు. ఆయుష్మాన్ భ‌వ ప‌థ‌కాన్ని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, అది మోదీ పథకం కావడంతోనే తెలంగాణలో అమలు చేయలేదని అన్నారు.

తెరాస పేదల వ్యతిరేక పార్టీ అని - ఆ పార్టీని ప్రజలు ముందు దోషిగా నిలబెడతామని లక్ష్మణ్ అన్నారు. భారతీయ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వస్తామంటే కొండా సురేఖతో పాటు ఎవరికైన తమ పార్టీ స్వాగతం పలుకుతుందని లక్ష్మణ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ సినీయర్ నాయకుడు బండారు దత్తత్రేయ మాట్లాడుతూ రాజకీయ నాయకుల‌కు నైతిక విలవలుండాలని - అధికారం కోసం పార్టీలను మారుస్తూ పోతున్నారని - ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కోట్లాది రూపాయ‌లు ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. ఓటరు నమోదుకు గడువు అక్టోబరు 10 వ తేది వరకూ పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.