Begin typing your search above and press return to search.

బీజేపీకి అద్దె నాయకత్వం వద్దు - సొంత నాయకత్వం ముద్దు!

By:  Tupaki Desk   |   13 Aug 2019 2:43 PM IST
బీజేపీకి అద్దె నాయకత్వం వద్దు - సొంత నాయకత్వం ముద్దు!
X
'మా పార్టీకి అద్దె నేతలు వద్దు.. సొంత నేతలే కావాలి..'అని అంటున్నారు భారతీయ జనతా పార్టీ సిసలైన అభిమానులు - సోషల్ మీడియా సైనికులు. గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీలోని పరిణామాల పట్ల సిసలైన కాషాయధారులు వాపోతూ ఉన్నారు. ఎవరెవరో పార్టీలోకి చేరడం - వాళ్లేదో పార్టీని ఉద్ధరిస్తున్నట్టుగా కలరింగ్ ఇవ్వడం పట్ల వారు బాధపడుతూ ఉన్నారు.

తను కూస్తే కానీ తెల్లరదు అని కోడి అనుకున్నట్టుగా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారని - ఇటీవలే తమ పార్టీలోకి చేరి వారు అథారిటీ చేస్తున్నారని బీజేపీ వాళ్లు బాధపడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన వారి విషయంలో బీజేపీలో ఈ బాధ వ్యక్తం అవుతూ ఉంది.

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడంతో కొంతమంది నేతలు వెళ్లి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీకి కూడా రాజ్యసభలో వారి అవసరం ఉండి చేర్చుకుంది. వారేమో కేసులు-బ్యాంకులకు అప్పులు- చంద్రబాబును కాపాడుకోవడం.. వంటి లక్ష్యాలతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వారు ఇన్నేళ్లూ చంద్రబాబుకు అతి సన్నిహితులు - చంద్రబాబుకు శ్రేయోభిలాషులు.

దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీదా వారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అందరూ తమలాగే మాట్లాడాలని కూడా వారు ఒత్తిడి చేస్తున్నారట. నిన్నలా మొన్న వచ్చి చేరి -ఇప్పుడు తమ మీద వారు అథారిటీ చేయడం - చంద్రబాబుకు రాజకీయ విధానాలను అమలు చేయాలని చూస్తూ ఉండటం పట్ల భారతీయ జనతా పార్టీలో నిరసన ధ్వనిస్తోందని తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీ అంటే కేవలం రాజకీయ పార్టీ కాదు. దానికంటూ విధివిధానాలున్నాయని ఆ పార్టీ వారు అంటారు. ఆ పార్టీలో నాయకత్వ స్థాయికి వెళ్లాలంటే ఎన్నో దశాబ్దాల పాటు పని చేసిన నేపథ్యం ఉండాలి. అలాంటి వ్యవస్థలో ఎదిగిన వారు ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి హడావుడి చేస్తున్న వారి తీరు మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఆ విషయాన్ని వారు ఆఫ్ ద రికార్డుగా మీడియా దగ్గర వివరిస్తూ ఉన్నారు.