Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రీమేక్ ఫార్ములా రెఢీ!

By:  Tupaki Desk   |   19 July 2019 10:00 AM IST
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రీమేక్ ఫార్ములా రెఢీ!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ అంత ఘ‌న విజ‌యం ఎందుకు సాధించారు? ప్ర‌ధాని మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి న‌గ‌రంలో బ‌స్టాండ్ సైతం స‌రిగా లేకున్నా.. రోడ్లు గుంత‌ల‌తో ద‌ర్శ‌న‌మిస్తున్నా.. మౌలిక స‌దుపాయాలు అంటూ ఏమీ లేకున్నా.. గంగ‌ను శుభ్రం చేసేస్తా అంటూ బ‌డాయి క‌బుర్ల‌లో ప‌దిపైస‌ల‌ వంతు కూడా పూర్తి కాకున్నా.. మోడీకి ఎందుకు జై కొట్టారు? ఆ మాట‌కు వ‌స్తే వార‌ణాసి మాత్ర‌మే కాదు.. ఉత్త‌రాది మొత్తం బీజేపీ హ‌వా ఎందుకంత‌గా న‌డుస్తోంది.

హాయ్.. న‌మ‌స్తే.. బాగున్నారా? లాంటి ప‌దాల్ని ఉత్త‌రాది వారు వ‌దిలేసి చాలా కాల‌మే అయ్యింది. దానికి బ‌దులుగా ప్ర‌తి దానికి (హాయ్.. న‌మ‌స్తే.. థ్యాంక్స్ లాంటి ప‌దాల‌కు స‌మాన అర్థంలో) జైశ్రీ‌రామ్ అన్న మాట‌ను ప‌ర‌స్ప‌ర చెప్పుకోవ‌టం ఎందుకు? త‌ర‌చి చూస్తే ఇలాంటి ఎన్నో విష‌యాలు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తాయి. హిందుత్వ అస్త్రాన్ని గురి త‌ప్ప‌ని రీతిలో ప్ర‌యోగించే నేర్పు మోడీషాల సొంతం.

మ‌నిషి మొత్తాన్ని మార్చేసే అంశాల్లో మ‌తం.. ప్రాంతం.. కులం కీల‌క‌మ‌న్న విష‌యాలు తెలిసిందే. స‌రిగ్గా వీటిల్లో మొద‌ట‌గా ఉన్న మ‌తాన్ని ముడిస‌రుకుగా తీసుకొని.. దానికి జాతీయ‌వాదాన్ని అద్దేయ‌టం ద్వారా తిరుగులేని ఫార్ములాను రెఢీ చేసిన మోడీషాలు త‌మ జైత్రయాత్ర‌ను నిరాటంకంగా కొన‌సాగిస్తున్నారు. వారి ల‌క్ష్యాలుగా కొత్త కొత్త రాష్ట్రాలు వ‌చ్చి చేరుతున్నాయి. తాజాగా వారి టార్గెట్లుగా రెండు తెలుగు రాష్ట్రాలు నిలిచాయి.

ఉత్త‌రాదితో పోలిస్తే.. ద‌క్షిణాదిలో అందునా రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌తం మ‌త్తు పెద్ద‌గా ఉండ‌దు. కానీ.. దానికి మించిన రీతిలో కులం కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. అయితే.. మ‌త్తుమందు ఒక్క‌సారి రుచి చూపిస్తే.. త‌ర్వాత నుంచి దాని వెంట ప‌డే బ‌ల‌హీన‌త గురించి బీజేపీకి బాగా తెలుసు. అందుకే.. తొలుత తెలంగాణ‌పై ఫోక‌స్ చేసింది. కేసీఆర్ అనుస‌రించే విధానాలే త‌మ బ‌లంగా భావిస్తోంది.

స్వ‌యంగా హిందువైన కేసీఆర్‌.. మైనార్టీల విష‌యంలో స్నేహ‌పూర్వ‌కంగా ఉండ‌ట‌మే కాదు.. మైనార్టీల కోసం త‌పించేట్లుగా చెప్పే మ‌జ్లిస్ ను త‌న క్లోజ్ ఫ్రెండ్ గా చెప్పుకోవ‌ట‌మే కాదు.. చేత‌ల్లోనూ పెద్ద‌పీట వేస్తున్న ప‌రిస్థితి. దీంతో.. యాగాలు.. పూజ‌లు చేసే కేసీఆర్ మైనార్టీల‌కు మిత్రుడన్న భావ‌న క‌లిగించ‌టంలో స‌క్సెస్ అయ్యారు. కేసీఆర్ ఎక్క‌డ గెలిచారో.. త‌న వ్యూహాన్ని ప‌క్కాగా అమ‌లు చేశారో.. స‌రిగ్గా అక్క‌డి నుంచే బీజేపీ నేత‌లు రివ‌ర్స్ ఇంజ‌నీరింగ్ మొద‌లెట్టారు.

కేసీఆర్ బ‌లాన్ని బ‌ల‌హీన‌త‌గా మార్చి.. దానికి అనుగుణంగా భావోద్వేగాన్ని రంగ‌రిస్తూ.. త‌న ప‌ట్టును పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి సంద‌ర్భంలోనే హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో కేసీఆర్ చేసే వ్యాఖ్య‌లు పైకి పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌కున్నా.. ఆయా వ‌ర్గాల వారి మ‌నోభావాల్ని ఎంత‌లా హ‌ర్ట్ చేయాలో అంత‌లా హ‌ర్ట్ చేసే ప‌రిస్థితి. దీనికి తోడు తాను టార్గెట్ చేసిన రాష్ట్రంలో ఇలాంటి వాటిని అవ‌కాశాలుగా మార్చుకొని తాను బ‌ల‌ప‌డే ప్లాన్ ను విజ‌య‌వంతంగా అమ‌లు చేసిన దాని ఫ‌లిత‌మే క‌రీంన‌గ‌ర్ ఎంపీ స్థానాన్ని సొంతం చేసుకోవ‌టం గా చెప్పాలి.

ఇక్క‌డో విష‌యాన్ని ప్ర‌స్తావించాలి. క‌రీంన‌గ‌ర్ టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా వినోద్ బ‌రిలో ఉన్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనే కాదు.. తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని నేత‌.. రాజీ ప‌డ‌ని వ్య‌క్తిత్వం. అన్నింటికి మించి చ‌క్క‌టి వాగ్దాటి ఉన్న నేత‌. అలాంటి ఆయ‌న సైతం ఓడిపోవ‌టం మామూలు విష‌యం కాదు. అంతేనా.. కేసీఆర్ తెలంగాణ‌లో తిరుగులేని నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ వ‌చ్చి ప‌డిన ఓట‌మి లెక్క చూస్తే.. భ‌విష్య‌త్తులో ఎలాంటి డేంజ‌ర్ బెల్స్ మోగ‌నున్నాయ‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. క‌రీంన‌గ‌ర్ ఫార్ములాను తెలంగాణ వ్యాప్తం చేయ‌టానికి బీజేపీ సిద్ధ‌మ‌వుతుంది.

ఇదిలా ఉంటే.. ఏపీలో క్రైస్త‌వ ధ‌ర్మాన్ని న‌మ్మే సీఎం జ‌గ‌న్ విష‌యంలోనూ బీజేపీ నేత‌లు తెలంగాణ ఫార్ములానే అనుస‌రించ‌నున్నారు. ఏపీని క్రైస్త‌వం చేయనున్నార‌న్న భావ‌న క‌లిగించ‌టం ద్వారా మ‌త రాజ‌కీయాల్ని బీజేపీ తెర మీద‌కు తెస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఉత్త‌రాదిలో తానేం చేశారో.. ఎలా విజ‌యాన్ని సొంతం చేసుకున్నారో.. స‌రిగ్గా అదే ఫార్ములాను రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌గ్గ‌ట్లుగా మార్పులు చేయ‌టం ద్వారా.. అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌న్న‌ది క‌మ‌ల‌నాథుల ప్లాన్ గా చెబుతున్నారు. భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న రీమేక్ ను నేటివిటికి త‌గ్గ‌ట్లు స‌రైన మార్పులు చేస్తే బ్లాక్ బ‌స్ట‌రే. పొలిటిక‌ల్ రీమేక్ తోనూ ఇదే మేజిక్ చేయొచ్చ‌ని న‌మ్మే బీజేపీ.. ఏపీ తెలంగాణ‌పై తాజాగా ఫోక‌స్ పెట్టింది అందుకేన‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.