Begin typing your search above and press return to search.

ఆ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ సర్వే.. ఏం జరగనుంది?

By:  Tupaki Desk   |   12 Aug 2021 4:00 PM IST
ఆ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ సర్వే.. ఏం జరగనుంది?
X
ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి పడే ఎన్నికలు కేంద్ర ప్రభుత్వాన్ని ఊపిరి పీల్చుకోనివ్వని పరిస్థితి. ఈ కారణంతోనే ఒకేసారి అన్ని ఎన్నికలు పూర్తి అయ్యేలా జమిలి ఎన్నికల్ని తీసుకురావాలని మోడీ సర్కారు భావిస్తోంది. అయితే.. చెప్పినంత తేలిగ్గా జమిలి ఎన్నికలు పూర్తి అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఈ మధ్యనే ముగిసిన ఎన్నికలు ఒక కొలిక్కి రాకముందే.. మరికొద్ది నెలల్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్ తోపాటు.. పంజాబ్.. గోవా.. ఉత్తరాఖండ్.. మణిపూర్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కేంద్రంలోని మోడీ సర్కారుకు పరీక్షగా మారాయి.

ఇటీవల కాలంలో మోడీ ఇమేజ్ భారీగా దెబ్బ తిందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ వస్తున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 2024 ఎన్నికలకు రెండేళ్లు ముందుగా జరిగే ఈ ఎన్నికల ఫలితాలు కేంద్రం మీద ప్రభావాన్ని చూపించటం ఖాయం. ఈ కారణంగానే బీజేపీ కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యూపీలో అధికారాన్ని నిలుపుకుంటేనే 2024 సార్వత్రిక ఎన్నికల వేళకు మనోబలం పెరుగుతుందన్న అంచనాతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలు తెలుసుకోవటం కోసం నమో యాప్ ను సిద్ధం చేశారు. ఐదు రాష్ట్రాల్లోని వారికి ఈ యాప్ ను పరిచయం చేయటం.. వారి ద్వారా ఫీడ్ బ్యాక్ ను తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటన్న విషయాల్ని ప్రజల నుంచి తెలుసుకోవాలన్న ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. అందుకు తగ్గట్లు ఈ యాప్ ను సిద్ధం చేశారు. దీని ద్వారా ఐదు రాష్ట్రాల ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది? ప్రజలు తమకు ఎంత మేర అనుకూలంగా ఉన్నారు? తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తమకున్న అవకాశాలు ఎంతమేర ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారు.

అయితే.. పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలు.. వ్యాక్సినేషన్ విషయంలో జరిగిన ఆలస్యం.. సంక్షేమ పథకాల అమలుతో పాటు.. పెరిగిన నిత్యవసరాల ధరలు.. ఎంతకూ తగ్గని నిరుద్యోగ సమస్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. నమో యాప్ ద్వారా తమకు వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రాల వారీగా చూస్తే.. ఉత్తరాఖండ్.. పంజాబ్.. యూపీలలో ప్రభుత్వంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు తమకు లాభం చేకూరుస్తాయని బీజేపీ భావిస్తోంది. అయితే.. వ్యవసాయ చట్టం నేపథ్యంలో బీజేపీకి అవకాశం లేదంటున్నారు. మరోవైపు యూపీలో యోగి సర్కారు మీద ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు.

బ్రాహ్మణుల్ని అణగదొక్కే ప్రయత్నం జరిగిందని.. తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆగ్రహం వారిలో ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ వ్యతిరేక ఓటు సమీక్రతమైతే.. బీజేపీకి నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. అందుకే.. ఐదు రాష్ట్రాల్లోనూ తమకు జరిగే నష్టాన్ని ముందుగా గుర్తించి.. అందుకు తగ్గట్లు పరిష్కారాలు వెతకాలన్న యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.