Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో బీజేపీ ప్లానింగ్ మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   5 July 2019 11:11 AM IST
తెలంగాణ‌లో బీజేపీ ప్లానింగ్ మామూలుగా లేదుగా?
X
క‌న్ను ప‌డ‌టం ఆల‌స్యం.. సొంతం చేసుకునే వ‌ర‌కూ అదే ప‌నిగా ప్ర‌య‌త్నించ‌టం బీజేపీకి మొద‌ట్నించి అల‌వాటే. అదే ఇప్పుడా పార్టీని తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా మారింది. ఒక‌ప్పుడు దేశంలో బీజేపీ అంటే.. నాలుగైదు రాష్ట్రాల‌కే ప‌రిమితంగా ఉండేది. అలాంటిది అంత‌కంత‌కూ విస్త‌రించుకుంటూ పోతూ.. ఈ రోజున బీజేపీ చేతిలో లేని రాష్ట్రాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పాలి.

ఇలాంటివేళ‌.. త‌మ‌కు అవ‌కాశం ఉన్న రాష్ట్రాల్ని ఐడెంటిఫై చేసిన బీజేపీ.. కొద్ది నెలల్లో జ‌రిగే ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో కాషాయ‌జెండా ఎగుర‌వేయ‌టం ఖాయ‌మంటున్నారు. దీనికి సంబంధించిన సంకేతాలు ఇటీవ‌ల వెల్ల‌డైన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు చెప్పేశాయంటున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బెంగాల్ లో త‌మ హ‌వా ఎంత‌లా ఉంద‌న్న విష‌యాన్ని శాంపిల్ గా చూపించామని.. అస‌లు సినిమా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చూపిస్తామ‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాల్ని తెలంగాణ‌లో సొంతం చేసుకోవ‌టంతో బీజేపీ పెద్ద‌ల్లో కొత్త ఆశ‌లకు తెర తీసిన‌ట్లుగా చెబుతున్నారు. తాము కాస్త ఫోక‌స్ పెడితే తెలంగాణ‌లో బీజేపీ జెండా రెప‌రెప‌లాడ‌టం ఖాయ‌మ‌ని.. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం లేని నేప‌థ్యంలో ఇప్పుడా కొర‌త తీర్చే అవ‌కాశం త‌మ‌కే ఉంద‌న్న భావ‌న ఆ పార్టీలో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇందుకోసం తెలంగాణ‌కు సంబంధించి ప‌క్కా ప్లాన్ ఒక‌టి డిసైడ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఒక కొత్త వ్యూహాన్నిసిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌త అనుభ‌వ‌నాలు.. వివిధ రాష్ట్రాల్లో అనుస‌రించిన విధానాల్ని క‌ల‌బోసి.. తెలంగాణ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు కొత్త ప్లాన్ ఒక‌టి సిద్ధ‌మైందంటున్నారు.

రాష్ట్రంలోని వివిధ రంగాల‌కు చెందిన వారిని ఎంపిక చేయ‌టం.. ఆయా రంగాల‌కు చెందిన సామాజిక వ‌ర్గాల‌తో ప్ర‌త్యేక భేటీలు ఏర్పాటు చేయ‌టం ఈ వ్యూహంలో భాగ‌మంటున్నారు. స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉన్న వైద్యులు.. ఉపాధ్యాయులు.. ఇంజ‌నీర్లు.. ఐటీ రంగ నిపుణులు.. ఇలాంటి వారిని గుర్తించి.. వారితో వేర్వేరుగా స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

తొలుత కేడ‌ర్ ను పెంచుకోవ‌టం.. ఆ త‌ర్వాత వారిని ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లోకి దింప‌నున్న‌ట్లు చెబుతున్నారు. రిటైర్డ్ టీచ‌ర్ల‌ను ప్ర‌త్యేక కేడ‌ర్ గా తీసుకొని.. వారి ద్వారా వ్యూహాల్ని అమ‌లు చేయ‌టం.. త‌మ‌పార్టీ విధానాల్ని ప్ర‌చారం చేసేందుకు వినియోగించుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

వివిధ కుల సంఘాల ప్ర‌తినిధుల‌తో మాట్లాడ‌టం కూడా చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ త‌ర‌హా వ్యూహాల‌తో క‌ర్ణాట‌క‌.. మ‌హారాష్ట్రల‌తో పాటు యూపీలో పార్టీ బ‌ల‌ప‌డ‌టానికి ఈ వ్యూహ‌మే కార‌ణ‌మ‌ని.. తాజాగా ఇదే విధానాన్ని తెలంగాణ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్పులు చేసి అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్రంలోని ఐటీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌తో భేటీ అయిన బీజేపీ వారితో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించింది. దేశంలో మార్పు కోసం అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని.. ఆలోచ‌నాప‌రులు.. తెలివైన వారు ఒక పక్క‌గా ఉండిపోతే ఎలాంటి లాభం ఉండ‌ద‌న్న మాట‌ను వారికి చెబుతూ త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఏ ప్రొఫెష‌న్ కు చెందిన వారినైనా స‌రే.. వారి అవ‌స‌రం త‌మ‌కు.. త‌మ పార్టీకి ఉంద‌ని చెబుతూ దేశం కోసం వారు త‌మ పార్టీలో చేరాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట‌ను చెబుతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ విధంగా ఆర్కిటెక్ట్ లు.. ఐటీ రంగ నిపుణులు.. బిల్డ‌ర్లు.. వైద్యులు.. డేటా సైంటిస్టులు ఇలా ప్ర‌తి ఒక్క రంగానికి చెందిన నిపుణుల‌తో భేటీ అవుతూ.. వారిని త‌మ పార్టీలో చేర్చుకోవ‌టం ద్వారా బ‌ల‌మైన కొత్త త‌ర‌హా కేడ‌ర్ ను బిల్డ్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇంత ప‌క్కా ప్లానింగ్ లో వ‌స్తున్న బీజేపీని గులాబీ బాస్ ఎలా ఎదుర్కొంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రం.