Begin typing your search above and press return to search.

పాక్ బూచి.. మ‌రో రాష్ట్రంలోనూ ఓట్లు తేలేదు సుమీ!

By:  Tupaki Desk   |   11 Feb 2020 8:00 PM IST
పాక్ బూచి.. మ‌రో రాష్ట్రంలోనూ ఓట్లు తేలేదు సుమీ!
X
పాకిస్తాన్ ను బూచి గా చూపి తాము రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను పొందే ప్ర‌య‌త్నాలు చేయ‌డం భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లకు కొత్త కాదు. దేశంలో ఎప్పుడె, ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చినా.. భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లు అప్ప‌టిక‌ప్పుడు పాకిస్తాన్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌స్తూ ఉండ‌టాన్ని సామాన్య ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నిస్తూనే ఉన్నారు. క‌మ‌లం పార్టీ వాళ్లు అలా పాక్ ను బూచి గా చూపి ఇండియాలో ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌నే ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉన్నారు. గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇండో-పాక్ స‌రిహ‌ద్దుల్లో తీవ్ర‌మైన ఉద్రిక్త‌త‌లు రేగాయి. ఆ ఉద్రిక్త‌త‌లు బీజేపీకి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భారీగా ఓట్లు ప‌డేలా చేశాయ‌నేది ఒక విశ్లేష‌ణ‌.

ఆ విశ్లేష‌ణ బీజేపీ వాళ్ల‌కే బాగా న‌చ్చిన‌ట్టుగా ఉంది. అందుకే.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏదో విధంగా పాక్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌స్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ప్ర‌ధాని మోడీ పాక్ పేరెత్తారు. పాక్ ను వారం రోజుల్లో ఓడించేస్తాం..అంటూ మోడీ చేసిన వ్యాఖ్య అర్థం ఏమిటో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇలా పాక్ ను దెబ్బ‌తీస్తాం అంటూ మోడీ ఢిల్లీలో భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టి ఓట్ల‌ను పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డ్డాయి.

ఆ సంగ‌తేమో కానీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎదురుదెబ్బే త‌గిలింది. ఐదేళ్ల కింద‌టితో పోలిస్తే సీట్ల సంఖ్య పెరిగి ఉండొచ్చు కానీ, మోడీ- అమిత్ షాలు మంత్రాంగం ర‌చించి.. ఢిల్లీలో పార్టీని గెలిపించాల‌ని చేసిన ప్ర‌య‌త్నం మాత్రం స‌ఫ‌లం కాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రోసారి ఢిల్లీలో పాగా వేసింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ విధానాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ఆప్ కు ఢిల్లీ ప్ర‌జ‌లు ప‌ట్టం గ‌ట్టారు.

స్థానికేత‌ర స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ భార‌తీయ జ‌న‌తా పార్టీ తిర‌స్క‌ర‌ణ పొందుతూ ఉంద‌నే విశ్లేష‌ణ‌లు ఇప్ప‌టికే ఉన్నాయి. ఢిల్లీ ఎన్నిక‌ల్లో కూడా పాకిస్తాన్ - ఎన్ ఆర్సీ అంటూ.. బీజేపీ మ‌రో తిర‌స్క‌ర‌ణ పొందిన‌ట్టుగా ఉంద‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.