Begin typing your search above and press return to search.

నితీష్ కుమార్‌కు షాక్.. ఆప‌రేష‌న్ క‌మ‌లం స్టార్ట్!

By:  Tupaki Desk   |   3 Sep 2022 6:36 AM GMT
నితీష్ కుమార్‌కు షాక్.. ఆప‌రేష‌న్ క‌మ‌లం స్టార్ట్!
X
బిహార్‌లో త‌మ‌తో పొత్తును తెంచుకుని లాలూప్ర‌సాద్ యాద‌వ్ కు చెందిన రాష్ట్రీయ జ‌నతాద‌ళ్ (ఆర్‌జేడీ)తో పొత్తు పెట్టుకున్న ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, జన‌తాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీష్ కుమార్ కు బీజేపీ గ‌ట్టి షాక్ ఇచ్చింది.

మణిపూర్‌లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు బీజేపీలో చేరిపోయారు. ప్ర‌స్తుతం మ‌ణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. జార్ఖండ్, బిహార్‌ల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు బీజేపీ షాకిస్తుంద‌ని చ‌ర్చ జ‌రుగుతున్న వేళ అనూహ్యంగా ఈ రెండు రాష్ట్రాల‌ను వ‌దిలేసి మ‌ణిపూర్‌లో నితీష్ కుమార్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది.

కాగా, బీజేపీలో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేల విలీనానికి మ‌ణిపూర్ స్పీకర్ అంగీకారం తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఉన్నందున, వారి ఫిరాయింపు చెల్లుబాటు అవుతుంద‌ని అసెంబ్లీ కార్య‌ద‌ర్శి చెబుతున్నారు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసిన 38 నియోజకవర్గాల్లో ఆరింటిని గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఆరింటిలో ఐదుగురు బీజేపీలో చేరిపోవ‌డంతో నితీష్ పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేల్లో ఖజాయ్‌కిషన్, ఎన్ సనాతే, ఎండీ అచాబ్ ఉద్దీన్, మాజీ డీజీపీ ఎల్‌ఎం ఖౌటే, తంజామ్ అరుణ్‌కుమార్ ఉన్నారు.

వాస్త‌వానికి తంజామ్ అరుణ్ కుమార్ గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించారు. కానీ బీజేపీ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న జేడీయూలో చేరి టికెట్ ద‌క్కించుకుని గెలుపొందారు. ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం మ‌ణిపూర్ రాష్ట్ర‌ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తోంది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డ్డాయి. బీజేపీపై జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. డ‌బ్బులు వెద‌జిమ్మి బీజేపీ ప్ర‌తిపక్ష ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తోంద‌ని ఆరోపించారు.

మ‌ణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా ఇందులో బీజేపీ 32 స్థానాల‌ను గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల్లో, ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఐదు స్తానాల్లో, నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ 7 స్థానాల్లో, కుకి పీపుల్స్ అల‌య‌న్స్ రెండు స్థానాల్లో గెలుపొందాయి. ఇప్పుడు ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేర‌డంతో ఆ పార్టీ బ‌లం 37కి పెరిగింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.