Begin typing your search above and press return to search.

అక్కడ చిన్న పార్టీలకు పెద్ద గిరాకీ..

By:  Tupaki Desk   |   13 March 2017 6:17 AM GMT
అక్కడ చిన్న పార్టీలకు పెద్ద గిరాకీ..
X
మణిపూర్ లో కాంగ్రెస్ - బీజేపీలకు పూర్తి మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఆ రెండు జాతీయ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ లోని చిన్నచిన్న పార్టీల నేతలతో రెండు పార్టీలూ సంప్రదింపులు జరుపుతుండడమే కాకుండా వారి కోర్కెలు తీర్చి వారిని తమతో కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ చిన్న పార్టీలకు ఇప్పుడు మంచి గిరాకీ ఏర్పడిందట.

ముఖ్యంగా అక్కడి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ చక్రం తిప్పడానికి సిద్ధమైంది. లోక్‌ సభ మాజీ స్పీకర్‌ పీఏ సంగ్మా స్థాపించిన ఎన్‌ పీపీకి నాలుగు సీట్లు వచ్చాయి. పార్టీలోని ముఖ్యు లతో చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్‌ పీపీ వర్గాలు తెలిపాయి. ఎన్‌ పీపీ కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమైన ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌ ఈడీఏ)లో కొనసాగుతోంది. ఈ కూటమిని బీజేపీయే గత ఏడాది ఏర్పాటు చేసింది. అస్సాం భాజపా అధ్యక్షుడిగా ఉండే హిమంత బిశ్వాస దీన్ని ఏర్పాటు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ - నాగాలాండ్ - అస్సాం - మణిపూర్ లోని పలు పార్టీలు ఇందులో ఉన్నాయి.

మరోవైపు ఇక్కడి నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ కూడా నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఈ పార్టీ ఇబోబిసింగ్‌ ఏర్పాటు చేసిన ఏడు జిల్లాలకు వ్యతిరేకంగా త్రీవమైన పోరాటం చేస్తోంది. వీరు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం దాదాపు లేనట్టే. ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు కాంగ్రెసేతర ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. కేంద్రమంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జనశక్తి పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే... నాగా పీపుల్స్ పార్టీ బీజేపీ పంచన చేరకుండా ఉండేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోందట.

మణిపూర్ లో మొత్తం 60 స్థానాలుండగా కాంగ్రెస్‌ 28 - బీజేపీ 21 - ఎన్‌ పీపీ 4 - ఎన్‌ పీఎఫ్‌ 4 - ఎల్జేఎస్పీ 1 - స్వతంత్రులు రెండు స్థానాల్లో గెలుపొందారు. అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్‌ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అదే.. బీజేపీకి అయితే 10 మంది మద్దతు కావాలి. కానీ.. నేషనల్ పీపుల్స్ పార్టీ... నాగా పీపుల్స్ ఫ్రంట్లు బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉండడం.. ఎల్జేపీ మద్దతు ఉండడంతో స్వతంత్రుల్లో ఒకరి మద్దతు పొందితే బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/