Begin typing your search above and press return to search.

బిహార్ లో మజ్లిస్ దూకుడు వెనుక కేసీఆర్?

By:  Tupaki Desk   |   17 Nov 2020 1:20 PM IST
బిహార్ లో మజ్లిస్ దూకుడు వెనుక కేసీఆర్?
X
ఇప్పటివరకు వినిపించే అంచనాలకు భిన్నమైన వాదన ఒకటి తాజాగా తెర పైకి వచ్చింది. బీజేపీకి బద్ధ శత్రువుగా అభివర్ణించే మజ్లిస్.. జాతీయ స్థాయిలో మాత్రం మెడీషాలతో ప్రత్యేకమైన ఒప్పందం ఉందంటూ రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. తనదైన ఓటు బ్యాంకు కోసం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తమ పార్టీని బరిలోకి నిలపటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సత్తా చాటిన మజ్లిస్.. ఇటీవల వెల్లడైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఐదు స్థానాల్లో పాగా వేసింది.

ఇదంతా బీజేపీ పుణ్యమేనని ఓపక్క వాదన వినిపిస్తుంటే.. అందుకు భిన్నంగా కమలనాథుల నోటి నుంచి వస్తున్న మాటలు మరోలా ఉన్నాయి. బిహార్ లో మజ్లిస్ ఐదు స్థానాల్ని చేజిక్కించుకోవటం వెనుక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విచిత్రమైన విషయం ఏమంటే.. ఇతర రాష్ట్రాల్లో మజ్లిస్ దూకుడు వెనుక బీజేపీ అధినాయకత్వం ఉందన్న ఆరోపణపై ఇప్పటివరకు కమలనాథులు బలంగా కొట్టి పారేసిన ఘటన చోటు చేసుకోలేదు. అదే సమయంలో బిహార్ ఎన్నికల్లో మజ్లిస్ కు అన్ని విధాలుగా దన్నుగా నిలిచింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ప్రచారం జోరందుకుంది.

అయితే.. ఈ ప్రచారం వెనుక గ్రేటర్ ఎన్నికల వ్యూహం ఉన్నట్లుగా పలువురు అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. గ్రేటర్ లో కమలనాథులు పాగా వేయాలంటే.. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగే అంశం ఒకటి ఉండాలి. విన్నంతనే నమ్మేలా ఉండే మసాలా వార్త ఒకటి ప్రచారంలోకి వస్తే.. బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలాంటివి మొదలుపెట్టారా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ బిహార్ ఎన్నికల్లో మజ్లిస్ సాధించిన ఐదు సీట్ల వెనుక కేసీఆర్ ఉన్నదే నిజమైతే.. ఆ మధ్య జరిగిన మహారాష్ట్రతో పాటు.. మిగిలిన రాష్ట్రాల ఎన్నికల వేళలోనూ గులాబీ బాస్ పేరు రావాలి కదా?

అప్పుడు రాని పేరు ఇప్పుడే ఎందుకు వస్తుంది? అన్నది మరో ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక అండతోనే మజ్లిస్ అధినేత చెలరేగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ.. ఈ వాదనలో నిజమే అనుకుందాం. నిజానికి మజ్లిస్ కు ఆర్థిక దన్ను ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్ కు ఉందా? అన్నది మరోప్రశ్న. ఎందుకంటే.. మజ్లిస్ పార్టీ ఏమీ నిధుల లేమితో తల్లడిల్లిపోయేది కాదన్నది మర్చిపోకూడదు. భావోద్వేగ అంశాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా.. గ్రేటర్ ఎన్నికల్లో బలమైన ప్రచారాంశంగా మార్చే క్రమంలో ఇదో రకమైన ప్రచారంగా చెబుతున్నారు. మరి.. ఈ కొత్త ఆరోపణపై గులాబీ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.