Begin typing your search above and press return to search.

సెంచరీ బీజేపీ... సంచలనాలే ఇక ... ?

By:  Tupaki Desk   |   2 April 2022 2:30 PM GMT
సెంచరీ బీజేపీ...  సంచలనాలే ఇక ... ?
X
రాజ్యసభలో బీజేపీ సెంచరీ కొట్టింది. నిజంగా ఇది అరుదైన రికార్డుగానే అంతా చూస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 245 మంది ఎంపీలు ఉంటారు. సింపుల్ మెజారిటీ అక్కడ దక్కించుకోవాలంటే 123 మంది కావాలి. దాదాపు మూడు దశాబ్దాల తరువాత అంటే 1990 నుంచి చూసుకుంటే ఒక పార్టీకి వంద సీట్లు రాజ్యసభలో రావడం ఇదే మొదటిసారి. ఆ రేర్ ఫీట్ ని బీజేపీ సాధించింది. 1990 నాటికి కాంగ్రెస్ 108 మంది సభ్యులతో అతి పెద్ద పార్టీలో రాజ్యసభలో ఉంది. ఇపుడు బీజేపీ సెంచరీ కొట్టినా సరే మెజారిటీకి 23 సీట్ల దూరంలో నిలిచి ఉంది.

దానికి బెంగ కానీ ఫికర్ కానీ అవసరం అయితే లేదు. పక్కన ఎన్డీఏ మిత్రులు ఉన్నారు. వారి సహకారంలో కీలక బిల్లులను బీజేపీ ఆమోదించుకోగలదు. ఇక బీజేపీ 2019లో కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ని రద్దు చేయగలింది. నాడు రాజ్యసభలో పెద్దగా నంబర్ లేకపోయినా మిత్రుల సహకారం, విపక్షాలలోని ఇతర పార్టీల హెల్ప్ తో ఇదంతా చేసింది. ఇపుడు బీజేపీ సొంతంగా వందకు చేరుకుంది. ఎన్డీఏ మిత్రులు ఎటూ ఉన్నారు. వైసీపీ, బిజూ జనతాదళ్ తదితర పార్టీల సాయం కూడా ఉంటుంది.

మొత్తానికి బీజేపీ రాజ్యసభలో మెజారిటీని సాధించినట్లే అనుకోవాలి. మరో వైపు చూస్తే లోక్ సభలో 303 సీట్లతో ఫుల్ మెజారిటీతో బీజేపీ ఉంది. ఇక జూన్ నాటికి మరో 52 రాజ్యసభ సీట్లకు ఖాళీలు ఏర్పడబోతున్నాయి. అందులో కూడా బీజేపీ ఒక్క యూపీ నుంచే ఎనిమిది దాకా సీట్లు దక్కించుకుంటుంది అని తెలుస్తోంది. మిగిలిన చోట్ల ఎలా చూసుకున్నా మరికొన్ని వస్తాయి. అంటే మెజారిటీకి దరిదాపుల్లోకి వచ్చేసినట్లే.

ఇలా బీజేపీ రాజ్యసభలో మెజారిటీకి చేరువగా వచ్చిన తరువాత ఈ ఏడాది చివరలో అంటే కొత్త రాష్ట్రపతి దేశంలో కొలువు తీరాక కొన్ని సంచలన చట్టాలను ఆ పార్టీ తీసుకువస్తుందని అంటున్నారు. అవి అలనాటి జనసంఘ్, ఈనాటి బీజేపీ ఏడుదశాబ్దాల రాజకీయ పార్టీ చరిత్రలో నినాదాలుగా, కలలుగా ఇప్పటిదాకా ఉన్నవే అంటున్నారు.

ఆ చట్టలను తీసుకురావడం ద్వారా బీజేపీ తన అజెండాను పూర్తిగా అమలు చేస్తుందని తెలుస్తోంది. మరి దీని వల్ల సమాజంలో కొన్ని ఇతర వర్గాల మీద ఏ రకమైన ప్రభావం ఉంటుంది అన్నది కూడా చూడాలి. అయితే మోడీ సాహసిగా ఈ రోజు దేశాన అగ్రభాగాన ఉన్నారు. ఆయన ప్రధానిగా బీజేపీ విధానాలను గతంలో ఎవరూ అమలు అవుతాయనుకోనివి కొన్ని చేసి చూపించారు.

ఇక నాడు పెద్దల సభలో మెజారిటీ లేక ఇబ్బందులు వచ్చాయి. ఇపుడు అలాంటి పరిస్థితి అయితే అసలు ఉండదు అంటున్నారు. మొత్తానికి మోడీ సర్కార్ మరిన్ని సంచలన నిర్ణయాలను ఈ ఏడాది చివరి నాటికి తీసుకోబోతుంది అని తెలుస్తోంది. తద్వారా బీజేపీ రాజకీయంగా బలపడడమే కాకుండా తాము కోరుకున్న తీరున భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది అని అంటున్నారు. ఇపుడు బీజేపీ సెంచరీ కొట్టిందీ అంటే సంచలనాలకు దేశం వెయిట్ చేయాల్సిందే అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఆ సంచలనాలు ఏమిటన్నవి.