Begin typing your search above and press return to search.

స్కూటీసరే.. ప్రమాద ఇన్సూరెన్స్‌ ఇస్తారా?

By:  Tupaki Desk   |   2 Oct 2015 2:00 PM GMT
స్కూటీసరే.. ప్రమాద ఇన్సూరెన్స్‌ ఇస్తారా?
X
తమిళనాడు తరహా ఎన్నికల వరాలు ఇప్పుడు బీహార్‌ లో కూడ వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో ఎన్నికల్లో గెలిపిస్తే చాలు ప్రతి ఇంటికీ ఓ కలర్‌ టీవీ లాంటి పథకాలతో గతంలో పురటిచతలైవి జయలలిత ఒక కొత్తరకం ట్రెండ్‌ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి టెక్నిక్కులనే బీహార్‌ బరిలోని వీరులు కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నారు. అక్కడ పదోతరగతి - ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్న అమ్మాయిలకు ఉచితంగా సైకిళ్లు ఇస్తాం అంటూ ప్రస్తుతం పాలనలో ఉన్న నితీశ్‌ కుమార్‌ కూటమి.. హామీ ఇచ్చింది. వారికంటె మేమేం తక్కువ తిన్నామా అని పంతానికి వెళ్లినట్లుగా ఈ విద్యార్థినులందరికీ.. ఏకంగా తలా ఒక స్కూటీ తీసిస్తాం అంటూ భాజపా ఎన్నికల హామీలను గుప్పిస్తోంది. వారి పార్టీ మానిఫెస్టోలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు.

టెన్త్‌ క్లాస్‌ చదివే 14 - 15 ఏళ్ల అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. భాజపా చెబుతున్న హామీ ప్రకారం.. ఆ రాష్ట్రంలో వారు అధికారంలోకి వస్తే.. ఆ రాష్ట్రంలో 14 ఏళ్లనుంచి 17 ఏళ్ల మధ్యలో ఉండే చదువుకునే ప్రతి అమ్మాయీ స్కూటీ నడుపుతూ ఉంటుందన్న మాట! సర్కారు వారు టోకుగ మాట్లాడుకుని స్కూటీలు తీసి ఇచ్చేస్తారు సరే.. నిత్యం వాటికి పెట్రోలు పోసుకుని తిరగడానికి.. అయ్యే ఖర్చును భరించేదెవ్వరు? ఈ లెక్కన కొన్ని లక్షల మంది అమ్మాయిలు కొత్తగా స్కూటీలు వేసుకుని రోడ్ల మీద తిరగడం మొదలెడితే.. వారికి ప్రమాద బీమా పరిస్థితి ఏంటి? ఇన్సూరెన్సులను కూడా ప్రభుత్వమే చేయిస్తుందా? నిజానికి టూవీలర్‌ నడపడానికి లైసెన్సు పొందే అర్హత ఉండని వయసులో వీరికి ఇలాంటి వాహనాలు ఇచ్చేస్తే జరగగల ప్రమాదాలకు బాధ్యత వహించేది ఎవరు? లాంటి చిల్లర సందేహాలే ఇప్పుడు పెద్దవిగా కనిపిస్తున్నాయి.

ఎంత వక్రమార్గాల్లోనైనా సరే.. ప్రత్యర్థికంటె తాము మెరుగైన పాలన అందిస్తాం అనే నమ్మకం ప్రజలకు కలిగించి ఓట్లు దండుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం సహజం. అంతమాత్రాన వారు సైకిళ్లు ఇస్తామంటే.. తాముస్కూటీలు ఇస్తాం అని, వారు స్కూటీలు ఇస్తాం.. అంటే తాము నానో కార్లు ఇస్తాం.. అని ఇలా అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటే వెళ్తే ఎలాగా అని జనం ప్రశ్నిస్తున్నారు.