Begin typing your search above and press return to search.

మునుగోడుపై బీజేపీ క‌న‌క వ‌ర్షం.. మేనిఫెస్టో రిలీజ్‌

By:  Tupaki Desk   |   27 Oct 2022 4:17 AM GMT
మునుగోడుపై బీజేపీ క‌న‌క వ‌ర్షం.. మేనిఫెస్టో రిలీజ్‌
X
మునుగోడు నియోజకరవర్గంలో తాము ఏం చేయ‌బోయేదీ వివ‌రిస్తూ.. బీజేపీ నేత‌లు మెనిఫెస్టోను రిలీజ్ చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం.. బీజేపీ మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు పేర్కొంది. 500 రోజుల్లో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తామని బీజేపీ అభ్య‌ర్థి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర నేతలతో మాట్లాడి ఈ హామీలు ఇస్తున్నట్లు వెల్లడించారు.

గ‌త 8 ఏళ్లలో మునుగోడులో టీఆర్ ఎస్‌ సర్కార్ చేయని అభివృద్ధిని.. కేంద్ర నిధులతో ఏడాదిన్నరలో చేసి చూపిస్తామని బీజేపీ ప్రకటించింది. మునుగోడు ఎన్నికల ప్రణాళికను ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఈటల రాజేందర్ , వివేక్ సహా ఇతర నేతలతో కలిసి మునుగోడు ఆవిష్కరించారు. కేంద్ర మంత్రులతో మాట్లాడాకే అభివృద్ధిపై హామీ ఇస్తున్నామని వెల్లడించారు.

2 వందల కోట్ల కేంద్ర నిధులతో రోడ్ల అభివృద్ధి, సంస్థాన్ నారాయణపురంలో టెక్స్ టైల్ పార్కు, మునుగోడులో ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం, 25 కోట్లతో చౌటుప్పల్ ఐటీఐ అభివృద్ధి, 100 కోట్లతో మూసీ నీళ్లను ఎత్తిపోసి చెరువులను నింపే కార్యక్రమం సహా వివిధ అంశాలను ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచారు.

''తెలంగాణకు బీజేపీనే శ్రీరామ రక్ష... రాష్ట్రం బాగుపడాలంటే.. బీజేపీ వల్లే సాధ్యం. కనీసం రోడ్లు వేయిద్దామన్నా.. కాంట్రాక్టర్లు టెండర్లు వేసే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో రోడ్లు వేయిస్తాం. ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు నితిన్ గడ్కరీ అంగీకరించారు.

చేనేత కార్మికులకు టెక్స్ టైల్ పార్కు, చౌటుప్పల్‌లో రూ. 25 కోట్లతో ఐటీఐ ఏర్పాటు చేస్తాం. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న మునుగోడులో సమస్య పరిష్కారానికి ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. మర్రిగూడలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. రూ.100 కోట్లతో మూసీ నీళ్లను చౌటుప్పల్‌లోని గ్రామాలకు ఎత్తి పోసే పథకాన్ని తీసుకొస్తాం'' అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

కేంద్ర పథకాలకు ప్రాంతీయ పార్టీలు వాళ్ల లేబుల్స్ వేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అనేది మోదీ నినాదమని వెల్లడించారు. సొమ్ము ప్రజలది, సోకు కేసీఆర్‌ది అన్నట్లుందని ఎద్దేవా చేశారు. మునుగోడులో కేసీఆర్‌ ఇప్పటికే ఓటమిని అంగీకరించినట్లు భావిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఒక్కరిపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.