Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మీద క‌మ‌ల‌నాథులకు కొత్త‌ ఆశ‌లు?

By:  Tupaki Desk   |   3 July 2017 12:25 PM IST
జ‌గ‌న్ మీద క‌మ‌ల‌నాథులకు కొత్త‌ ఆశ‌లు?
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు. మిగిలిన రంగాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. రాజ‌కీయాల్లో కాలానిదే కీల‌క‌పాత్ర‌. అది ప్ర‌భావితం చేసినంతగా మ‌రేది ప్ర‌భావితం చేయ‌లేదు. దీనికి తోడు.. అంకెల‌తోనూ.. అధికారంతోనూ ముడిప‌డి ఉన్న రాజ‌కీయంలో శాశ్విత మిత్రులు.. శాశ్విత శ‌త్రువులు అన్న వారు ఎవ‌రూ ఉండ‌రు. ఉండ‌బోరు. ఈ విష‌యం ఇప్ప‌టికే ఎన్నోసార్లు రుజువైంది కూడా.

ఏపీలో ప‌వ‌ర్లో ఉన్న అధికార‌ప‌క్షానికి.. దానికి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీకి మ‌ధ్య అంత చ‌క్క‌టి రిలేష‌న్ అంటూ ఏమీ లేద‌న్న విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అధినాయ‌క‌త్వంలోని ఒక వ‌ర్గం బాబు మీద గుర్రుగా ఉంద‌ని చెబుతారు. బాబు తీరును త‌ప్పు ప‌ట్టేందుకు అవ‌కాశం ఉన్నా.. మిత్ర‌త్వంలో భాగంగా ఏమీ అన‌లేక‌పోతున్నామ‌ని వాపోతుంటారు.

ఇదిలా ఉంటే.. రోజులు గ‌డిచే కొద్దీ అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతున్న ఏపీ విప‌క్షం వైపు కొంద‌రు క‌మ‌ల‌నాథులు పాజిటివ్‌ గా ఉన్నార‌న్న వార్త‌లు కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. మొద‌టి నుంచి బాబుతో ఉన్న రిలేష‌న్‌ ను ఇప్ప‌టికిప్పుడు క‌ట్ చేసుకునేందుకు క‌మ‌ల‌నాథులు మ‌క్కువ చూప‌కున్నా.. లెక్క తేడా వ‌స్తే.. బాబుకు గుడ్ బై చెప్పేందుకు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌ర‌న్నట్లుగా ప‌లువురు ఏపీ బీజేపీ నేత‌లు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెబుతుంటారు. దీనికి తోడు.. ఏపీలోని బాబు స‌ర్కారుపై ఏపీ ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పాళ్లు పెరుగుతుండ‌టాన్ని వారు త‌ర‌చూ ప్ర‌స్తావిస్తుంటారు.

పాల‌న‌లో స్పీడ్ త‌గ్గ‌టం.. ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే విష‌యంలో బాబు అంత స‌మ‌ర్థ‌వంతంగా వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌ని.. అవినీతిని అస్స‌లు కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ ఏపీ బీజేపీ నేత‌ల మాట‌ల్లో వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేళ‌లో.. ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ వైపు బీజేపీ నేత‌ల దృష్టి ఉంద‌న్న మాట‌కు బ‌లాన్ని చేకూరుస్తూ.. తాజాగా బీజేపీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన ఆ పార్టీ జాతీయ అధికార‌ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహ‌రావు మాట‌ల్ని చూస్తే నిజ‌మేన‌నిపించ‌క‌మాన‌దు.

ఒక ప్రైవేటు ఛాన‌ల్ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ పార్టీ వైపు బీజేపీ మొగ్గుచూపుతుందా? అన్న ప్ర‌శ్న‌కు న‌ర్మ‌గ‌ర్భంగా స‌మాధానం ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. పార్టీకి చాలా ముఖ్య‌మైన విష‌యంగా అనిపిస్తే అలా కూడా ఆలోచించొచ్చ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. అంటే.. జ‌గ‌న్ - బీజేపీ చేతులు క‌లిపినా క‌ల‌పొచ్చా? అన్న ప్ర‌శ్న‌కు నేరుగా స‌మాధానం ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీయే అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌టం ద్వారా జ‌గ‌న్‌.. ఏపీ అధికార‌ప‌క్షానికి మింగుడుప‌డ‌ని రీతిలో వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. వెనువెంట‌నే రాజ‌కీయంగా మార్పులు చోటు చేసుకోకున్నా.. దీర్ఘ‌కాలంలో మాత్రం టీడీపీ మైత్రీ బంధానికి బీట‌లు వారే అవ‌కాశం మాత్రం జ‌గ‌న్ రూపంలో పొంచి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/