Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను అమిత్ షా ఓ కంట క‌నిపెడుతున్నాడే

By:  Tupaki Desk   |   6 Sep 2018 5:36 PM GMT
కేసీఆర్‌ ను అమిత్ షా ఓ కంట క‌నిపెడుతున్నాడే
X
ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా జ‌రుగుతూనే...ఎంతో ఉత్కంఠ‌ను రేకెత్తించిన తెలంగాణ అసెంబ్లీ అంద‌రి అంచ‌నాల‌ను నిజం చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద్వారా ర‌ద్ద‌యింది. ఊహించ‌ని రీతిలో అసెంబ్లీ ర‌ద్దు - అనంత‌రం 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ త‌న దూకుడును పెంచారు. తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ ఎస్ పార్టీ అభ్యర్థులతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశం అయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మెనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మెనిఫెస్టోను అందజేస్తుందని - టీఆర్‌ ఎస్ పార్టీ చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. 31 జిల్లాల్లో టీఆర్‌ ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని దాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని కేసీఆర్ అన్నారు. నవంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి ఊరు - తండాలను వదల కుండా పర్యటనలను కొనసాగించాలని - ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.

కాగా, కేసీఆర్ దూకుడు నేప‌థ్యంలో అంద‌రి చూపు బీజేపీపైనే ప‌డింది. ఆ పార్టీ తెలంగాణ‌లో పుంజుకుంటుంద‌నే ఆలోచ‌న‌తో కాకుండా...బీజేపీతో దోస్తీ ద్వారా కేసీఆర్ ఇంత ధైర్యం చేయ‌గ‌లిగిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల పోరులో ఆ పార్టీ వైఖ‌రి ఎలా ఉండ‌నుంద‌నేది స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తించే అంశం. అయితే, త‌న‌పై నిందారోప‌ణ‌లు రాకుండా..బీజేపీ జాగ్ర‌త్త ప‌డుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే బీజేపీ ముఖ్య‌నేత‌లు స‌మావేశం అయ్యారు. ఈ నెల 15న మహబూబ్ నగర్ లో ఎన్నికల శంఖారావం బహిరంగ సభను నిర్వహించాల‌ని, ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. దీనికి ఆయ‌న సైతం ఓకే అన్న‌ట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున జనసమీకరణ చేసి క‌మ‌లం స‌త్తా చాటాల‌ని నేత‌లు కంక‌ణః క‌ట్టుకున్నారు. జనసమీకరణ కోసం రాష్ట్ర నేతలకు అసెంబ్లీ వారిగా ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు.

ఇదిలాఉండ‌గా...బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలని మోడీ కోరగా...ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కంటే ముందే కేసీఆర్ స్పందించి మెచ్చుకున్నారని గుర్తు చేశారు. నెలరోజుల లోపే జమిలి ఎన్నికల విషయంలో ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు. రెండు ఎన్నికలను ఎదుర్కోవడం అంటే అభివృద్ధికి ఆటంకమ‌ని అన్నారు. డబుల్ బెడ్రూమ్ లు - దళితులకు మూడెకరాలు ఇలా అన్ని హామీలను కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. బ్రాహ్మణులకు కేసీఆర్ ప్రభుత్వం శఠగోపం పెట్టిందని మండిప‌డ్డారు. ఎలాంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.